బంజారాహిల్స్, మార్చి 29 : ఓ నిర్మాణ సంస్థ బిల్డర్‌ను నగరానికి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్టుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఎమ్మెల్యేను తన నివాసంలో కలిసేందుకు వచ్చిన ఆ బిల్డర్‌కు సాయం చేసేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్టు ఆడియోలో స్పష్టమవుతున్నది. ఇదే సమయంలో రూ.25 లక్షలు ఇప్పటికే తీసుకున్నట్టు కూడా తెలుస్తున్నది. ‘నా స్థాయి 25 లక్షలు కాదు.. 2 కోట్లు ఇస్తే పని అయిపోతుండె. కలెక్టర్, ఎమ్మార్వో, అధికారులను సెట్ చేస్తా.. రూ. 25 లక్షలు అనుచరులకు ఇచ్చా.. రూ.2 కోట్లు ఇస్తే అందర్నీ సెట్ చేస్తా.. ఎమ్మార్వోకు కొంత, అధికారులకు కొంత సెట్ చేసి మీ పనిచేయిస్తా.. మీరు ఏదీ తేల్చరు. సాగదీస్తూ వచ్చి 25 లక్షలు ఇచ్చి వదిలేశారు. మీ స్థలం ప్రభుత్వానిదని తేలింది. ఇప్పుడు నేను ఏమీ చేయలేను. రాజకీయ నాయకుడిగా ఏదైనా చెప్తా.. అన్ని పత్రాలూ సరిగ్గా ఉన్నాయా? లేవా? అనేది చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీ ల్యాండ్‌తో సమస్య ఉన్నది.. నేనేం చేయాలి? ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించారు.
అందుకే పనికాలేదు. భూమి ప్రభుత్వానిదిగా తేలడంతో ప్రస్తుతం ఏమీ చేయలేను’ అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన బిల్డర్‌కు సంబంధించి 1,200 గజాల భూమికి యూఎల్సీ క్లియరెన్స్ అంశంలో ఈ డీల్ జరిగినట్టు తెలుస్తున్నది. భూమి ప్రభుత్వానిదని తేలడంతో వ్యవహారం చిక్కుల్లో పడింది. బాధితుడు తాము నివాసం ఉండటానికి ఇల్లు కట్టుకుంటున్నామని, అంత డబ్బు ఇచ్చుకోలేమని చెప్పగా.. ‘ఒక్కొక్కరు రూ.10 లక్షలు వేసుకుంటే కోటి అయిపోతుంది కదా? దానికి వెనుకాముందు ఆడుతున్నారు.. ఇక మీ ఇష్టం’ అంటూ సదరు ఎమ్మెల్యే అసహనం వ్యక్తంచేశారు. రూ.25 లక్షలు ఎందుకు తీసుకున్నారని బిల్డర్ ప్రశ్నించగా.. తన రేటు రూ.25 లక్షలు కాదని, జీహెచ్ఎంసీ పని అయితే చేస్తానని, ప్రభుత్వ స్థలమైతే తీసుకున్న రూ.25 లక్షలు ఇచ్చెయ్యమని చెప్తానని అక్కడే ఉన్న కార్యకర్తలను ఆదేశించడం ఆడియోలో స్పష్టంగా ఉన్నది.