హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాన్ని బద్నాం చేయాలనే కుట్రతోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో బాధ్యతారహితంగా మాట్లాడారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి, కిశోర్‌గౌడ్, రఘురామ్, రామచంద్రునాయక్, గాంధీనాయక్‌తో కలిసి మీడియాతో వినోద్‌కుమార్ మాట్లాడారు. కేసీఆర్ పదేండ్ల పాలనను చులకచేసిన మాట్లాడిన ఆమె తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణను 1956లో ఆంధ్రాతో కలిపినప్పుడే తెలంగాణ మిగులు బడ్జెట్‌తో ఉండేదని గుర్తుచేశారు. ఆర్థికవేత్త బీపీఆర్ విఠల్ కూడా తన పుస్తకంలో తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమని చెప్పారని, 2014లో కూడా తెలంగాణ ఏర్పడ్డప్పుడు కూడా మిగులు రాష్ర్టామేనని చెప్పారు. ‘అప్పులు తెచ్చి కేసీఆర్ వృథాగా ఖర్చు చేయలేదు. సంపద, ఆస్తులు సృష్టించారు. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. రేవంత్‌రెడ్డి రోజూ కూర్చునే పోలీస్ కమాండ్ కంట్రోల్ కేసీఆర్ కట్టలేదా? కేసీఆర్ ప్రతి జిల్లాకూ మెడికల్ కాలేజీ కట్టారు.. అది ఆస్తా ? అప్పా?’ అని నిలదీశారు.
తెలంగాణకు ప్రత్యేకంగా ఏమిచ్చారు?
తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేకంగా ఏమీ ఇవ్వకపోయినా నిర్మలాసీతారామన్ మాటలు వింటే నవ్వొచ్చిందని వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. మెదక్ రైల్వేస్టేషన్ కట్టామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం 20 ఏండ్ల తర్వాత అది పూర్తయ్యిందని, ఇందిరాగాంధీ పేరు ఎందుకు లాగుతున్నారని నిలదీశారు.
మోదీ చేసిన అప్పులపై మాట్లాడరా?: సత్యవతిరాథోడ్
విభజన చట్టం హామీలు నెరవేర్చడం కేంద్రం బాధ్యత అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హితవుపలికారు. తెలుగు రాష్ట్రాల కోడలినంటూ చెప్పుకొనే నిర్మల.. తెలంగాణను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ అప్పుల గురించి మాట్లాడుతున్న నిర్మల ప్రధాని మోదీ వచ్చాక పెరిగిన అప్పుల గురించి మాట్లాడరా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు తరలించారని విమర్శించారు. ఒక ములుగు నియోజకవర్గంలోనే కేసీఆర్ పది వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, జిల్లా పర్యటనకు వచ్చి చూస్తే జరిగిన అభివృద్ధి తెలుస్తుందని అన్నారు. తెలంగాణ మీద సీతారామన్ నిందలు వేయడం మానుకోవాలని సూచించారు. తెలంగాణను చిన్నగా చేసి చూపిస్తే నిర్మలాసీతారామన్ పెద్దగా అయిపోరని ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డి తెలంగాణను బద్నాం చేస్తున్నట్టే.. సీతారామన్ కూడా బద్నాం చేసేలా మాట్లాడారు. తెలంగాణను బద్నాం చేసే కాంగ్రెస్, బీజేపీ కుట్రను ప్రజలు గమనిస్తున్నారు. వాటి ఆటలు సాగబోవు. సీతారామన్ వ్యాఖ్యల వెనక తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నాయి.
-బోయినపల్లి వినోద్‌కుమార్
సీతారామన్ రెండు రోజులు తెలంగాణ పర్యటనకు వస్తే ఇకడి అభివృద్ధి తెలుస్తుంది. తెలంగాణకు ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్న అనేక హామీలు పెండింగ్‌లో ఉన్నాయి. ముందు సీతారామన్ వాటిని పరిషరించాలి.
-బోయినపల్లి వినోద్‌కుమార్