జహీరాబాద్, జనవరి 3 : ‘దండం పెడ్తాం సారూ.. మీ కాళ్లు మొక్కుతాం.. ఫార్మాల్డిహెడ్ రసాయన పరిశ్రమను గ్రామంలో ఏర్పాటు చేయవద్దు’ అని సంగారెడ్డి జిల్లా మల్గి గ్రామస్తులు అధికారులను వేడుకున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు శ్రీఆశ అల్డిహైడ్స్ అండ్ అడ్హెసిప్స్ ప్రైవేటు లిమిటెడ్ ఫార్మాల్టిహైడ్ రసాయన పరిశ్రమ ఏర్పాటుపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
ఈ సందర్భంగా టీపీజేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ కన్నెగంటి రవి, సంగారెడ్డి జిల్లా కోకన్వీనర్ అశోక్‌కుమార్, నాయకులు రాగుల లక్ష్మి, మానన, పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ బాబూరావు మాట్లాడుతూ.. ఈ పరిశ్రమలో వినియోగించే ఫార్మాల్టిహైడ్, అసిటాల్టిహైడ్, మిథనాల్ వంటి విషపూరిత రసాయనాలతో క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, పిల్లల్లో మందబుద్ధి వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. హైదరాబాద్, ఉమ్మడి మెదక్‌తో పాటు పలు జిల్లాలకు తాగునీరు, సాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. మల్గి గ్రామ నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటికే గ్రామ శివారులో ఉన్న క్రషర్, ఎముకలు, మాంసం కర్మాగారాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు. ఈ రసాయన పరిశ్రమను ఏర్పాటు చేయవద్దని కోరారు.