కుంటాల, జనవరి 16 : నిర్మల్ జిల్లా కుంటాల మండలం దౌనెల్లిలో గురువారం రేషన్‌కార్డు సర్వే చేస్తున్న ప్రభుత్వ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. దౌనెల్లి గ్రామ పంచాయతీలో దౌనెల్లి తండా, మహాదేవ తండా అనుబంధ గ్రామాలుగా ఉన్నాయి. ఈ తండాల్లో 1200కు పైగా జనాభా ఉండగా.. 100 మంది రేషన్‌కార్డుల కోసం అర్జీలు సమర్పించారు. దౌనెల్లికి 20, దౌనెల్లి తండాకు 22, గమ్మపూర్ తండాకు 5, మహదేవ్ తండాకు నాలుగు కార్డులు మంజూరయ్యాయి.
గురువారం రెవెన్యూ అధికారులు షార్ట్ లిస్టు అయిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేయడానికి వెళ్లారు. 51 మంది లబ్ధిదారుల పేర్లు మాత్రమే వెరిఫికేషన్ లిస్ట్‌లో ఉండడంతో గ్రామస్తులు అధికారులను నిలదీసి, వెరిఫికేషన్ ప్రక్రియను అడ్డుకున్నారు. అర్హులందరికీ కార్డులివ్వకుండా కొందరికే ఎలా ఇస్తారని మండిపడ్డారు. తహసీల్దార్ ఎజాజ్‌ఖాన్ వచ్చి గ్రామస్తులతో మాట్లాడగా వారు అర్జీని సమర్పించారు.