హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): సముద్ర విజ్ఞానం, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిని మరింత వేగవంతం చేసేందుకు విజ్ఞాన్స్ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్కాయిస్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ భాగస్వామ్యం ద్వారా సముద్ర పరిశీలన, సమాచార వ్యవస్థల అభివృద్ధి, రీసెర్చ్ ప్రాజెక్టులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో ఇరు సంస్థలు సంయుక్తంగా పని చేయనున్నాయి. విద్యార్థులు, యువ పరిశోధకులకు బ్లూ ఎకానమీ, మెరైన్ టెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తూ ప్రాంతీయస్థాయి పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దడమే ఈ ఒప్పందం ఉద్దేశం.
విస్తారమైన తీరప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య పేర్కొన్నారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్రో మాజీ సైంటిఫిక్ సెక్రటరీ, అంతరిక్ష కార్పొరేషన్ మాజీ సీఎండీ డాక్టర్ వీ ఎస్ హెగ్డే, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మాజీ డిస్టింగ్విష్డ్ సైంటిస్టు, అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ వెల్లంకి శేషగిరిరావు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గ్రూప్ మాజీ డైరెక్టర్ డాక్టర్ కే హనుమంతరావు, సీఈవో మేఘన కూరపాటి తదితరులు పాల్గొన్నారు.