హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ): శలాక విద్వత్ సమర్చన 9వ పురసార ప్రదాన కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని స్వాధ్యాయ గ్రంథాలయ పరిశోధన సంస్థలో అత్యంత ఘనంగా జరిగింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శృంగేరి శంకరాచార్య ముఖ్యఅతిథిగా పాల్గొని ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యకు విద్వన్మణి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ.. శలాక వారు మహాద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు. సంస్కృతాంధ్ర సారస్వతాల్లో విశేష కృషి చేసిన మహనీయులను గౌరవించడం మన ధర్మం అని చెప్పారు. ఆచార్య సుప్రసన్నకు ఈ పురసారం అందించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఆచార్య సుప్రసన్నాచార్య మాట్లాడుతూ, తన గురువులు శ్రీశివానందమూర్తి, విశ్వనాథ సత్యనారాయణను గుర్తు చేసుకున్నారు. సాహిత్యాన్ని, సంస్కృతిని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీపెరంబుదూరు శ్రీరంగాచార్యులు, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య యాదగిరి, డాక్టర్ అకిరాజు సుందరరామకృష్ణ, డాక్టర్ వఝల రంగాచార్య, ముత్యం రామ్మోహన్, డాక్టర్ వీరభద్రుడు, సీనియర్ జర్నలిస్ట్, రచయిత కోవెల సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.