హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అన్ని నేరాలు తగ్గుముఖం పట్టాయని, సైబర్ నేరాల నమోదులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని డీజీపీ అంజనీకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని క్రైం, ఫంక్షనల్ వర్టికల్స్పై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నేరాల నమోదు నిర్ధారిత ప్రమాణాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. పరిశోధనలో ఉన్న కేసులు 52.01కు తగ్గాయని, పోక్సో కేసుల్లోను, ఎస్సీ, ఎస్టీలపై నేరాల్లోనూ గణనీయమైన తగ్గుదల ఉందని వివరించారు. సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, అడిషనల్ డీజీ అభిలాష బిస్త్, ఐజీ షానవాజ్ ఖాసీం పాల్గొన్నారు.
కానిస్టేబుళ్లకు త్వరలో శిక్షణ
నూతనంగా నియామకం కానున్న 14,881 పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోని 28 పోలీస్ ట్రైనింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. పోలీస్ కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్ల శిక్షణ ఏర్పాట్లపై మంగళవారం అన్ని పోలీస్ ట్రైనింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో వీసీ నిర్వహించారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో శిక్షణను ప్రారంభించనున్నట్లు తెలిపారు.