శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 01:10:28

నిరాడంబరంగా బ్రహ్మోత్సవాలు

నిరాడంబరంగా బ్రహ్మోత్సవాలు

  • భద్రాచలం, వేములవాడలో వేడుకలు ప్రారంభం

భద్రాచలం, నమస్తే తెలంగాణ/వేములవాడ కల్చరల్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో బుధవారం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా ప్రారంభం అయ్యాయి. రామాలయంతోపాటు పర్ణశాలలోని ఆలయంలో శ్రీశార్వరి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదే విధంగా వచ్చేనెల 2న శ్రీసీతరాముల కల్యాణం, 3న శ్రీరామపట్టాభిషేకం జరుగనున్నది. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా మొదటి రోజు అర్చకులు స్వామివారికి ఏకాంత స్నపనం గావించారు. సంప్రదాయబద్ధంగా శార్వరీ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని వేప పూత ప్రసాద వినియోగం గావించారు. రాత్రి ఆస్థాన పురోహితులు చెన్నావజ్జుల వెంకటేశ్వర అవధాని పంచాంగ శ్రవణం చేశారు. 

ఈ సారి రామయ్య ఆదాయం11, వ్యయం 8.. సీతమ్మ ఆదాయం 2, వ్యయం 11గా అవధాని పేర్కొన్నారు. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో శ్రీరామవనమి నవరాత్రోత్సవాలు సాదాసీదాగా ప్రారంభించారు. స్వామివారి కైంకర్యాలకు ఆటంకం లేకుండా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాల మధ్య నిరాడంబరంగా నిర్వహించారు. ఉదయం ప్రాతఃకాల పూజ అనంతరం రాజన్న ఆలయ అద్దాలమండపంలో అర్చకులు నవరాత్రోత్సవాలకు వర్ణి తీసుకున్నారు. అనంతరం ఆలయ అనుబంధ దేవాలయం సీతారామచంద్రస్వామికి పంచోపనిషత్తులద్వారా, శ్రీలక్ష్మీ గణపతికి, స్వామి వారికి, అమ్మవార్లలకు అభిషేకపూజలు నిర్వహించారు.  


logo