హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపేందుకు సిద్ధమవుతున్నది. వారు వ్యాపారంలో రాణించేందుకు త్రీ, ఫోర్ వీలర్స్‌ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొత్తం 417 వాహనాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రూ.29.7 కోట్లు వెచ్చించనున్నారు. రెండు నెలల్లో పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. 60 శాతం సబ్సిడీతో ఈ వాహనాలను అందించనున్నారు.. మిగిలిన మొత్తానికి పలు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలు వ్యాపారంలో రాణించేందుకు వాహనాల కేటాయింపులో వారికే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథమ్) ఆధ్వర్యంలో మహిళలకు చేపల వంటకాల తయారీపై శిక్షణ ఇస్తున్నారు.
మత్స్యకారులు చేపలు పట్టి వాటిని దళారులకు విక్రయిస్తున్నారు. దీంతో వారికి వచ్చే ఆదాయంలో కోత పడుతున్నది. చేపల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం మత్స్యకారులకే దక్కేలా మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. మత్స్యకారులే నేరుగా చేపలతోపాటు చేపల వంటకాలను విక్రయించేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. చేపల వంటకాలను అప్పటికప్పుడు చేసి విక్రయించేలా 197 మొబైల్ ఫిష్ ఔట్లెట్స్ (ఫోర్ వీలర్స్), చేపలు విక్రయించేందుకు 200 త్రీ వీలర్స్ (ఐస్ బాక్స్‌తో), 20 ఇన్సులేటెడ్ ట్రక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఒక్కో మొబైల్ ఫిష్ ఔట్లెట్ ఖరీదు రూ.10 లక్షల వరకు ఉండగా ఇన్సులేటెడ్ ట్రక్కు ధర రూ.20 లక్షలు, త్రీ వీలర్ ధర రూ.3 లక్షలుగా ఉన్నది. తొలిదశలో భాగంగా ప్రభుత్వం మత్స్యకారులకు రూ.531 కోట్ల భారీ ఖర్చుతో 62,173 వాహనాలను పంపిణీ చేసింది. ఇందులో రూ.298 కోట్లతో 58,229 మోటార్ సైకిళ్లు, రూ.147 కోట్లతో 2,973 లగేజీ ఆటోలు, రూ.72 కోట్లతో 844 మొబైల్ ఫిష్ ఔట్లెట్స్, రూ.11 కోట్లతో 111 ట్రాన్స్పోర్ట్ వాహనాలు, రూ.3.22 కోట్లతో 16 ఇన్సులేటెడ్ ట్రక్స్‌ను అందజేసింది.