హుజూరాబాద్‌టౌన్, మే 8: ఎనిమిది పదుల వయసులో ఈ అవ్వకు పెద్ద కష్టం వచ్చిపడింది. వారం క్రితం చికిత్స కోసం దవాఖానలో చేర్పించిన కొడుకులు.. ఇంటికి తీసుకెళ్లేందుకు రాకపోవడంతో హాస్పిటల్‌లోని పార్కింగ్ స్థలం వద్దే అత్యంత దయనీయస్థితిలో కాలం గడుపుతున్నది. తనను ఇంటికి తీసుకెళ్లాలని వచ్చిపోయే వారిని వేడుకొంటున్న తీరు గుండెలను పిండేస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లికి చెందిన వీరమనేని లింగమ్మ, వెంకట్రావు దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. వెంకట్రావు కొన్నేండ్ల క్రితం మృతి చెందాడు. కూతురు కూడా గతంలోనే మరణించింది.
కొన్నేండ్లుగా ఆమె ఖమ్మంలోని చిన్న కొడుకు వద్ద ఉంటున్నది. హుజూరాబాద్‌లో ఉంటున్న కూతురి పిల్లల వద్దకు నెల క్రితం వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యం బారినపడటంతో వారం క్రితం కుమారులు చికిత్స కోసం హుజూరాబాద్ దవాఖానలో చేర్పించారు. చికిత్స అనంతరం లింగమ్మను ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు ఆమె కొడుకులకు సమాచారమిచ్చినా వారు రాలేదు. దిక్కుతోచనిస్థితిలో ఆమె దవాఖాన గేటు పక్కన పార్కింగ్ స్థలంలో కాలం గడుపుతున్నది. ఆదివారం ఆమెను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా తనగోడు వెళ్లబోసుకున్నది. తనకెవరూ మంచి నీళ్లు కూడా ఇస్తలేరని, చిన్న కొడుకు ఇచ్చిన డబ్బులు ఖర్చయ్యాయని వాపోయింది. ఐదురోజులుగా స్థానికంగా దొరికే నల్లా నీటిని తాగుతూ పూటగడుపుతున్నట్టు కన్నీరు మున్నీరవుతున్నది.