గజ్వేల్, అక్టోబర్ 7 : తెలంగాణకు కాబోయేది బీసీ ముఖ్యమంత్రే అని పీపీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారని, రేవంత్‌రెడ్డి మూడేండ్ల పాలనలో ఫెయిల్ కావడంతోనే తెరపైకి బీసీ ముఖ్యమంత్రి అంశాన్ని తీసుకొచ్చారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సొంత పార్టీలోనే రేవంత్‌రెడ్డి వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకు వెంటనే నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పాలన ఇలాగే ఉండే తెలంగాణలో పార్టీ ఊడ్చుకుపోతుందనే విషయాన్ని రాహుల్‌గాంధీ, మహేశ్‌కుమార్ గౌడ్ ముందుగానే గ్రహించారని చెప్పారు. రేవంత్‌రెడ్డి రూ.4లక్షల కోట్ల అప్పుచేసి ఏ అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.
కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం, సీతారామ, నెట్టంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీలో 25 కిలోమీటర్ల టన్నెల్, కలెక్టరేట్, మెడికల్ కళాశాలలు, మిషన్ భగీరథ, రూ.76 వేల కోట్ల రైతుబంధుతోపాటు అభివృద్ధి పనులు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను ఇస్తే ఇప్పుడెందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ప్రజలను డైవర్షన్ చేసేయత్నంలో ఎర్రవల్లిలోని 325లో సర్వే చేయిస్తున్నారని విమర్శించారు. 45ఎకరాల్లో అమరులకాలనీ నిర్మాణం చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గచ్చిబౌలిలో 200 ఎకరాల్లో లేఅవుట్ చేసి అమరులు, ఉద్యమకారుల కుటుంబాలకు ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 325లో ఏమీ లేదని.. 388 ఎకరాలు ఎర్రవల్లి రెవెన్యూలోనే ఉందనే విషయాన్ని అధికారులు తేల్చారని చెప్పారు. 1970లోనే శివారు వెంకటాపూర్ భూములను ఎర్రవల్లిలో కలిపారని, రేవంత్‌రెడ్డి ల్యాపింగ్ పేరుతో ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు.