ముషీరాబాద్, జనవరి 18: దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బీజేపీ నేతలు దళితవాడల్లో పర్యటిస్తామనడం శోచనీయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చే శారు. దళితులు, ముస్లింలు, క్రైస్తవుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని మండిపడ్డారు. విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దళిత వాడల్లోకి రాకుండా బీజేపీ నాయకులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దళితులను అన్నివిధాలా మోసగించి, దాడులకు పాల్పడినందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తొలుత అంబేద్కర్ విగ్రహం ఎదుట ముక్కు నేలకు రాసి దళితులకు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే దళితవాడల్లోకి రావాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగానికి బీజేపీ తూట్లు పొడుస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ముస్లింల ఆస్తులను గుంజుకొంటున్న బీజేపీ నేతలు.. జైశ్రీరామ్ అని పలికితేనే తెలంగాణలో ఉండాలన్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. దళితులు, ముస్లింలు తినే తిండిపై ఆంక్షలు విధించింది బీజేపీయేనని నిప్పులు చెరిగారు. కుల, మతాల పేరుతో ప్రజలను విభజించి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి గ్రామాల్లో తిరిగే హక్కు లేదని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం దళితులు, ముస్లింలపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సభ్యులు పందుల సంజీవ, పొట్టపెంజర రమేశ్, కొల్లూరి వెంకట్, వరిగడ్డి చందు, ఎల్లేశ్, ధర్మారపు శ్రీకాంత్, నాగరాజు, సురేశ్ పాల్గొన్నారు.