వనపర్తి : వనపర్తి ప్రాంత సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుందామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో బాల భవన్ ఏర్పాటు కోసం మంత్రి నిరంజన్ రెడ్డిని పలువురు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కవులు, కళలకు, కళాకారులకు పుట్టినిల్లు వనపర్తి అన్నారు.
ఆ ప్రయత్నంలో భాగంగానే వనపర్తి తొలి శాసనసభ్యుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు మీద పార్క్ ఏర్పాటు చేసి, వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. వారి పేరుతో రెండు సంకలనాలు తీసుకొచ్చామని తెలిపారు. సాహిత్య శిఖరం సినారె 88వ జయంతి వేడుకలు వనపర్తిలో అత్యంత వైభవంగా నిర్వహించిన విషయానని గుర్తు చేశారు.
2018లో మే 6న నిర్వహించిన జల కవితోత్సవం సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఎడ్యుకేషన్ హబ్‌గా పేరొందిన వనపర్తిలో కళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. జిల్లాగా ఏర్పాటు కావడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది. బాల కేంద్రాన్ని బాలభవన్‌గా అభివృద్ధి చేసుకుందామన్నారు. లలిత కళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.