హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : అమెరికాలో చదవడమంటే సమయాన్ని, కృషిని పెట్టుబడి పెట్టడమేనని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ అభిప్రాయపడ్డారు. యూఎస్‌లో చదువడం ముఖ్యమైన బాధ్యతలతో ముడిపడిన హక్కుగా విద్యార్థులు గుర్తించాలని పేర్కొన్నారు. తొలుత విద్యార్థులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘2025 ఎడ్యుకేషన్ యూఎస్ఏ యూనివర్సిటీ ఫెయిర్’ను లారా విలియమ్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లారా మాట్లాడుతూ అమెరికా వీసాకు అర్హత సాధించడంతోపాటు అమెరికా చట్టాలను కూడా పాటించాల్సి ఉంటుందని వెల్లడించారు.
చట్టాన్ని ఉల్లంఘించేది ప్రజలైనా.. విద్యార్థులైనా అమెరికాలో ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ నెల 9 నుంచి 17 వరకు దేశంలోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కత్తా, అహ్మదాబాద్, ముంబై, పూణేల్లో ఈ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. 30 వర్సిటీలు తాము నిర్వహిస్తున్న కోర్సులు, స్కాలర్‌షిప్‌ల గురించి విద్యార్థులకు వివరించడంతోపాటు సందేహాలను నివృత్తిచేశాయి.