HCU Land Issue | కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే నిజ నిర్ధారణ నివేదిక పంపాలని రాష్ట్ర అటవీశాఖ అధికారులను కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఇప్పటికే ఉన్న కోర్టు తీర్పులను పరిగణంలోకి తీసుకోని ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని.. వాస్తవధార నివేదికతో పాటు సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జీ నగేశ్, రఘునందన్ రావు ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ని కలిసిన విషయం తెలిసిందే. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని వినతిపత్రం అందజేశారు.
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలు పర్యావరణ, హెరిటేజ్ భూములని తెలిపారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు ఈ భూములు ఎంతో ప్రయోజనకరం కాబట్టి అనేక రకాల ఔషధ మొక్కలు, వివిధ పక్షి జాతులతో ఆ ప్రాంతమంతా అలరారుతున్నదని చెప్పారు. ఇంతటి విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌గా మార్చి రూ.వేలకోట్లు దండుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. హెచ్‌సీయూ విద్యార్థులతో పాటు హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు తెలిపారు. వెంటనే కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని, ఆ భూములను పరిరక్షించాలని కోరిన విషయం తెలిసిందే.