హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రోడ్డు ప్రాజక్టులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నది. తెలంగాణలోని పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ఎంతోకాలంగా పెండింగులో ఉండటమే ఇందుకు నిదర్శనం. నరేంద్రమోదీ సర్కారు తాజాగా రాష్ట్రంలోని ఒకే ఒక్క ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి మిగిలిన ప్రాజెక్టులను విస్మరించడం చర్చనీయాంశమైంది.
ఆర్అండ్బీ శాఖ మంత్రి సొంత జిల్లాలోని నల్లగొండ బైపాస్కు మాత్రమే కేంద్రం అనుమతి ఇవ్వడంతో సంబంధిత పత్రాలను తీసుకునేందుకు రాష్ట్ర అధికారులు బుధవారం ఢిల్లీ వెళ్తున్నారు. నల్లగొండ పట్టణంలో 14 కి.మీ. మేర నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి కేంద్రం రూ.516 కోట్లు మంజూరు చేసింది. వీటితో నకిరేకల్-నాగర్జునసాగర్ మధ్య బైపాస్ రోడ్డు పనులు ప్రారంభించనున్నట్టు ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. రాష్ట్రంలోని పలు ఇతర రోడ్డు ప్రాజక్టుల ప్రతిపాదనలను పెండింగ్‌లో పెట్టారు. వీటిలో ఇరుగు పొరుగు రాష్ర్టాలను అనుసంధానించే రహదారులు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే మార్గాలు, కీలక బ్రిడ్జీలు ఉన్నాయి. వీటిపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఇటీవల కేంద్ర పెద్దలను కలిసి సవివరంగా నివేదికను సమర్పించినప్పటికీ ఒక్క నల్లగొండ బైపాస్ పనులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.
కేంద్రం వద్ద పెండింగులో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు