సంగారెడ్డి, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఈనెల 19, 20వ తేదీల్లో ఇన్వెంటివ్-2024 పేరిట ఇన్నోవేషన్ ఫెయిర్ (మెగా ఆవిష్కరణల మేళా) నిర్వహించనున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 19వ తేదీన వెబ్‌నార్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రెండు రోజులపాటు ఐఐటీ హైదరాబాద్‌లో జరిగే ఇన్నోవేషన్ ఫెయిర్‌లో దేశంలోని 23 ఐఐటీలు, ఐఐఐటీలు, ఎన్ఐటీలు, బెంగళూరులోని ఐఐఏసీతోపాటు ఇతర ఇంజినీరింగ్ సంస్థలు పాల్గొననున్నాయి. 120 ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఇన్వెంటివ్ 2024కు సంబంధించిన వివరాలను శుక్రవారం ఐఐటీ గవర్నింగ్ బాడీ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్‌మూర్తి, ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ విద్యాధర్ సుబుధి, ఐఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ పీజే నారాయణన్ ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐఐటీలతోపాటు సాంకేతిక విద్యాసంస్థల్లో జరుగుతున్న పరిశోధనల వైపు దేశంలోని పారిశ్రామికవేత్తల దృష్టి మళ్లించడం, పరిశోధనలకు నిధులు సాధించడం లక్ష్యంగా ఇన్నోవేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఐఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ పీజే నారాయణన్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో రోడ్డు ప్రమాదాలు నివారించేలా కొత్త ఆవిష్కరణలను రూపొందించినట్టు తెలిపారు. నాగ్‌పూర్‌లో వీటిని పరిశీలించగా మంచి ఫలితాలు వచ్చినట్టు చెప్పారు.