ఖైరతాబాద్, సెప్టెంబర్ 4 : రాష్ట్రంలోని రేవంత్ సర్కార్‌పై నిరుద్యోగులు మరోసారి సమరశంఖం మోగించారు. పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి పెంపుతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి అశోక్ మాట్లాడుతూ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితిని 38 ఏండ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.
పోలీస్ ఎంపిక ప్రక్రియలో నిబంధనలు సడలించాలని కోరారు. గిరిజన ప్రాంతాల అభ్యర్థులకు ఏజెన్సీ కోటాను పునరుద్ధరించాలని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు పాత కమిషనరేట్ల ప్రకారం నోటిఫికేషన్ నిబంధనలు వర్తింపజేయాలని కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం జీవోలతో కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. తమ డిమాండ్లపై తక్షణమే స్పందించకపోతే సెప్టెంబర్ 7న అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.