Srinivas | ఎల్లారెడ్డిపేట/ఇల్లంతకుంట, ఆగస్టు 24: కొత్త ఉద్యోగంలో చేరేందుకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంలో ఎంపీడీవో, ఎంపీవో అవమానకరంగా మాట్లాడటంతో తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కిష్టారావుపల్లి కార్యదర్శి లంబాడా శ్రీనివాస్ వాపోయాడు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం ఫరీద్‌పూర్‌కు చెందిన శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కిష్టారావుపల్లి కార్యదర్శిగా బదిలీపై వచ్చాడు. ఉద్యోగం చేస్తూనే గురుకులం జూనియర్ లెక్చరర్‌గా, మున్సిపల్ సీనియర్ అకౌంటెంట్‌గా ఉద్యోగాలు సాధించాడు. గురుకుల జూనియర్ లెక్చరర్‌గా ఈ నెల 28న, సీనియర్ అకౌంటెంట్‌గా సెప్టెంబర్ 3న జాయిన్ కావాల్సి ఉంది. అందుకు సంబంధించి ఎన్వోసీ కోసం కలెక్టర్‌కు 10 రోజుల క్రితం అర్జీ పెట్టుకున్నట్టు తెలిపాడు. ఈ నెల 21న ఎంపీడీవో శశికళ, ఎంపీవో అబ్దుల్ వాజీద్‌కు అర్జీ పెట్టుకున్నానని, ఈ సమయంలో ఇక్కడే సరిగా విధులు నిర్వహించడం లేదు.. అక్కడెట్లా చేస్తావ్? అని ఎంపీవో అసహనంతో మాట్లాడారని, వెంటనే ఎంపీడీవో వద్దకు వెళ్లి తన ఎన్వోసీ ఇప్పించాలని కోరగా కాసేపు ఆగాలని చెప్పడంతో మనోవేదనకు గురై గడ్డిమందు తాగినట్టు తెలిపాడు. స్థానికులు అతన్ని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఆయన పరిస్థితిని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, ఇల్లంతకుంట మాజీ జడ్పీటీసీ వేణు అక్కడికి వెళ్లారు.
నేత కార్మికుడి ఆత్మహత్యాయత్నం
సిరిసిల్ల రూరల్, ఆగస్టు 24: ఉపాధి లేక రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఓ నేత కార్మికుడు ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని కేసీఆర్ నగర్ లో ఉంటున్న బోయిని సదానందం(36) మరమగ్గాలు నడుపుతున్నాడు. వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో పనిలేక ఖాళీగా ఉంటున్నాడు. కుటుంబ పోషణ, అప్పులు భారమై ఆందోళన చెందాడు. శనివారం ఇంట్లోనే గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్ దవాఖానకు తీసుకెళ్లారు.
కొలువు రాలేదని నిరుద్యోగి ఆత్మహత్య
భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 24: ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రామ్నగర్కాలనీకి చెందిన తంగెళ్లపల్లి రాజశేఖర్ బీటెక్ చదివాడు. ఇంటి వద్దే ఉండి ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతకీ జాబ్ రాకపోవడం, చదువు కోసం చేసిన అప్పులు పెరిగాయి. శనివారం ఉదయం తండ్రి పనికి వెళ్లగా, రాజశేఖర్ ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు ద ర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ భాసర్‌రెడ్డి తెలిపారు.