హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ రంగంలో దేశంలోనే ఏర్పాటైన మొట్టమొదటిది. ఘన చరిత్ర గల యూనివర్సిటీ పురోగమించడంలేదు. కొత్త.. డిమాండ్ ఉన్న కోర్సులు ప్రవేశపెట్టడంలేదు. పాత కోర్సులతోనే నడుస్తున్నది. యూనివర్సిటీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు 2008 నుంచి ఈ వర్సిటీ ఒక్క కొత్త కోర్సును ప్రవేశపెట్టలేదు. ఉన్న కోర్సులతోనే సరిపెడుతున్నది. కొత్తగా సినిమాటోగ్రఫీ, ఫిలిం మేకింగ్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినా స్థలం లేకపోవడం, భవనాలు సరిపోకపోవడంతో వెనుకంజవేస్తున్నారు. కొంత కాలం క్రితం బీఆర్ అంబేద్కర్ వర్సిటీకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని వర్సిటీకి కేటాయించారు. జీవో కూడా జారీచేశారు. దీన్ని బీఆర్ఏఓయూ వర్సిటీ సహా ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ భూ కేటాయింపు అంశం మరుగునపడింది.
ఉన్నత విద్యామండలికి ఎసరు..
స్థలం సరిపోకపోవడం, వసతులు లేకపోవడంతో వర్సిటీ ఉన్నత విద్యామండలికి ఎసరుపెడుతున్నది. మండలి కార్యాలయాన్ని ఖాళీచేయాలని ఇటీవలే జేఎన్ఏఎఫ్ఏయూ కోరింది. భవనాన్ని తమకు స్వాధీనం చేయాలని వర్సిటీ ఇటీవలే ఉన్నత విద్యామండలికి లేఖ రాసింది. దీంతో ఉన్నత విద్యామండలి మల్లగుల్లాలు పడుతున్నది. మాసాబ్‌ట్యాంక్‌లో 13.87 ఎకరాల స్థలంలో వర్సిటీ కొనసాగుతున్నది. అయితే 1,500 చదరపు గజాల స్థలం, భవనాన్ని మండలి వాడుకుంటున్నది. ప్రతి నెల రూ. 2,11,467లక్షల అద్దెను మండలి వర్సిటీకి చెల్లించాల్సి ఉంది. ఇలా ఏడాదికి రూ. 25.37 లక్షలు అద్దెగా కట్టాల్సి ఉంది. 11 ఏండ్లుగా మండలి అద్దె చెల్లించడంలేదు. ఈ బకాయిల మొత్తం రూ. 2.70కోట్లు ఉంటాయని, వీటిని చెల్లించాలని, లేదంటే ఖాళీ చేయాలని అంటున్నది. అయితే తమది ప్రభుత్వ సంస్థే కావడంతో అద్దె చెల్లించాల్సిన అవసరంలేదని ఉన్నత విద్యామండలి అధికారులు అంటున్నారు. మండలి భవనానికి వర్సిటీ నీటి సరఫరా బంద్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. అంతేకాకుండా పార్కింగ్, విద్యుత్తు ఇక్కట్లు సమస్యలున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది. బేగంపేటలో ఓయూకు చెందిన స్థలాన్ని కేటాయిస్తే.. నూతన భవనం కట్టుకుంటామంటూ ఉన్నత విద్యామండలి సర్కార్ ముందు ప్రతిపాదించింది.