బేగంపేట, జూలై 14: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 గంటలకు నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత (అవివాహిత) ముఖం నిండా పసుపు పూసుకొని మాతంగేశ్వరి అమ్మవారి ఆలయం ఎదుట పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించింది. ‘భక్తులు నాకు పూజలు చేయడం చాలా సంతోషానిచ్చింది… కానీ, నా కోరిక మీరు నెరవేర్చడం లేదు… ప్రతిసారీ నేను చెప్తూనే ఉన్నా.. అయినా మీరు ఈసారి కూడా పొరబాట్లు చేశారు. రాబోయే కాలంలో మరో మహమ్మారిని మీరు అనుభవించక తప్పదు.
నాకు ఐదు వారాలు పప్పు బెల్లంతో సాక సమర్పించండి. నా భక్తులను నేనే కాపాడుకుంటాను.. నేను తృప్తి చెందాలంటే నాకు రక్తం బలి ఇవ్వండి. నాకు రక్తం బలి ఇవ్వకపోతే రక్తం కక్కుకునేలా చేస్తాను.. నన్ను కొలిచే వారికి నేను ఎప్పుడూ తోడుగా నిలబడతాను. వర్షాలు కూడా ఈ సారి సరిపడా కురుస్తాయి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. గాలికి వదిలెయ్యవద్దు’ అని అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి అమ్మవారు నిప్పులుగగ్కారు. కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేద పండితులు, దేవాలయ వంశపారంపర్యులు, దేవాలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.