ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 26: ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్, కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్‌పై ఢిల్లీ పోలీసులు మోపిన ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. వారిపై కేసు నమోదుకు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి మంజూరు చేయడాన్ని ఖండించారు.
ఓయూ విద్యార్థులు, పరిశోధక విద్యార్థుల ఆధ్వర్యంలో ‘అరుంధతీరాయ్‌పై ఉపా కేసు-వాస్తవాలు’ అనే అంశంపై బుధవారం ఉస్మాని యా ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సదస్సులో ఆయన మా ట్లాడారు. అరుంధతీరాయ్ రచయిత్రిగా దేశంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలపై నిరంతరం తన కలం, గళంతో దేశీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రజల పక్షాన నిలబడిన ధీరవనిత అని కొనియాడారు.
2010 అక్టోబర్ 21న ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో జమ్మూకశ్మీర్‌కు ఉన్న స్వయంప్రతిపత్తి, అక్కడి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై ఆమె విస్తృతంగా చర్చించిన కారణంగా రూట్స్ ఇన్ కాశ్మీర్ సంస్థ సభ్యుడు సుశీల్ పండిత్ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. 14 ఏళ్ల తర్వా త కేసు విచారణకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. కేసును తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ కొండా నాగేశ్వర్, విద్యార్థి నాయకులు కోట శ్రీనివాస్, నెల్లి సత్యం, డాక్టర్ వంశీధర్, నాగేశ్వరరావు, సతీశ్, వలిగొండ నరసింహ, తాళ్ల అజయ్, రవినాయక్ పాల్గొన్నారు.
రోజుకు 400 మంది ఎస్జీటీలనే బదిలీ చేయండి: తపస్
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రోజుకు 400 మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)నే బదిలీ చేయాలని తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేశ్ ప్రభుత్వాన్ని కోరారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశాన్ని వారు బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఒక్కో టీచర్ వెయ్యి నుంచి 1,800 వరకు ఆప్షన్లు ఎంచుకోవాల్సి వస్తున్నదని, దీంతో ముఖ్యమైన స్థానాల ఎంపికకు అవకాశం లేకుండా పోతున్నదని తెలిపారు. అందుకే రోజుకు కొంతమంది చొప్పున బదిలీచేయాలని కోరారు.
రాష్ర్టానికి కొత్తగా 9 మంది ఐఏఎస్‌లు
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కొత్తగా 9 మంది ఐఏఎస్‌లు రానున్నారు. 2020, 2021 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులకు డీవోపీటీ క్యాడర్ నిర్ణయించింది. రాష్ర్టానికి కదిరవన్ పళని, శివేంద్ర ప్రతాప్, సంచిత్ గాంగ్వార్, ఫైజన్ అహ్మద్, లెనిన్ విస్టల్ టొప్పో, పీ గౌతమి, పర్మర్ పింకేశ్‌కుమార్ లలిత్ కుమార్, రాధికా గుప్తా, పీ శ్రీజను కేటాయించారు. వీరిలో సంచిత్ గాంగ్వార్ అసోం క్యాడర్ నుంచి తెలంగాణకు మార్చుకున్నారు.