రఘునాథపాలెం, నవంబర్ 5 : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన ఖమ్మం నగరంలోని పలు డివిజన్లు, రఘునాథపాలెం మండలంలోని వీ వెంకటాయపాలెంలో రూ.53 లక్షల వ్యయంతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. రఘునాథపాలెం మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు నేడు తెలంగాణ ప్రభుత్వంలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణంతో వీవీపాలెం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. అనంతరం నగరంలోని క్యాంపు కార్యాలయంలో కొత్తగా మంజూరైన పింఛన్ కార్డులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. 65 మందికి మంజూరైన రూ.25.65 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.