సైదాపూర్, ఆగస్టు 24 : ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలేయాల్సి వస్తుందన్న మూఢ నమ్మకంతో ఇద్దరు కొడుకులు కన్నతల్లినే కడతేర్చారు. మానవత్వం మరిచి ఆమెను బావిలో పడేసి ఘాతుకానికి పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హుజూరాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై స్వాతి సోమవారం సైదాపూర్లోని పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎలబోతారం గ్రామానికి చెందిన వృద్ధురాలు నూనె వెంకటమ్మ(80) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. నలుగురు కొడుకులు వంతుల వారీగా ఆమె కు భోజనం అందిస్తున్నారు.
ఏప్రిల్ 5న వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె ఎవరి ఇంట్లో చనిపోతే వా రు ఇల్లు వదిలేయాల్సి వస్తుందని కుటుం బ సభ్యులు చర్చించుకున్నారు. పెద్ద కొడుకు నూనె సమ్మయ్య, చిన్న కొడుకు నూనె శ్రీనివాస్ ఏప్రిల్ 6న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను బ యటకు తీసుకెళ్లి వ్యవసాయబావిలో పడేశారు. ఎవరికీ అనుమానం రాకుం డా తల్లి కనిపించడం లేదని, ఆమె కోసం వెతుకుతున్నట్టు నటించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఇద్దరు కొడుకులే నిందితులని ఆధారాలు సేకరించారు. వారిని అరెస్టు చేసినట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు.