దక్షిణభారత ప్రఖ్యాత నటుడు రజనీకాంత్ ఆత్మకథ రూపంలో తన జీవిత ప్రయాణాన్ని అభిమానులతో పంచుకోనున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ ఆత్మకథ పుస్తకం గురించి అధికారంగా ప్రకటించింది. ఓ ఇంటర్వ్యూలో ఈ పుస్తకానికి సంబంధించిన పలు విషయాలను ఆమె వెల్లడించింది. ‘నాన్న ఆత్మకథ రాస్తున్నారు. యోగి పరమహంస యోగానంద రాసిన ‘ఒక యోగి ఆత్మకథ’ పుస్తకం తరతరాలకూ ఎంత స్ఫూర్తినిచ్చిందో నాన్న ఆత్మకథ కూడా అలాగే స్ఫూర్తినిస్తుంది.
ఏండ్ల తరబడి పాఠకులు మళ్లీ మళ్లీ చదివేలా ఈ పుస్తకం నిలుస్తుంది. ఇది ఎలా రూపుదిద్దుకుంటున్నదో నేను దగ్గర ఉండి చూశాను. నాన్నగారి ఐదు దశాబ్దాల వ్యక్తిగత అనుభవాలు, వృత్తిపరమైన విజయాలు, అగ్రస్థానాన్ని చేరుకునే క్రమంలో ఎదురైన సవాళ్లు.. ఇలా అన్ని అంశాలూ ఈ పుస్తకంలో ఉంటాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోని అతి గొప్పనటుల్లో ఒకరిగా ఎదిగిన నాన్న జీవితం భావితరాలకు ఓ పాంఠ్యాంశం’ అని సౌందర్య రజనీకాంత్ పేర్కొన్నారు.