రామడుగు (చొప్పదండి) ఫిబ్రవరి 10: అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న వయసులో అమ్మ కన్నుమూసింది. తల్లిలోటు తెలియకుండా అన్నీ తానై పెంచి పెద్ద చేస్తున్న నాన్న ఇటీవల అనారోగ్యంతో తనువుచాలించాడు. తల్లిదండ్రుల మరణంతో ఆ ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు. అమ్మానాన్న లేనిలోకంలో బతికేదెట్లా? చదువులను సాగించేదెట్లా? అన్ని దీనంగా రోదిస్తున్నారు. దాతలు దయతలిచి ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లికి చెందిన దైవాల పరశురాములు-పావని దంపతులు.
వీరికి ఇద్దరు ఆడపిల్లలు అక్షర, కృషిత. వీరిది నిరుపేద కుటుంబం. కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎనిమిదేండ్ల కిందట పావని మంచంపట్టింది. కొంతకాలం తర్వాత తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది. అప్పటికి ఈ ఇద్దరు పిల్లల వయసు ఆరేండ్లలోపే. తల్లి మరణంతో తండ్రి పరశురాములు పిల్లలకు అన్నీ తానై ఆలనా పాలనా చూసుకున్నాడు. తర్వాత ఆ బాలికలను రామడుగు కస్తూర్బా బాలికల విద్యాలయంలో చేర్పించాడు. అక్షర(14) తొమ్మిది, కృషిత(12) ఎనిమిదో తరగతి చదువుతున్నారు. కాగా పరశురాములు కొన్ని రోజులుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ గతనెల 31న తనువుచాలించగా, ఆ ఇద్దరు బిడ్డలు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. నిలువనీడలేని పరిస్థితుల్లో దాతలు ఆపన్నహస్తం అందించాలని దీనంగా వేడుకుంటున్నారు. సాయం చేయాల్సిన వారు 9849262491 ఫోన్ నంబర్‌కు ఫోన్‌పే, గూగుల్ పే చేయాలని కోరుతున్నారు.