హైదరాబాద్: నల్లగొండ, సంగారెడ్డి రెడ్డి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడ్డారు. సోమవారం ఉదయం నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఆగిఉన్న వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం బోల్తాపడింది. అయితే కేబుల్ పనులు చేసే కార్మికులపై పడిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా దవాఖానకు తరలించారు. మృతులను కొండభీమనపల్లికి చెందిన యాస్వీ, రిజ్వాన్గా గుర్తించారు.
మరో ఘటనలో సంగారెడ్డి జిల్లా మద్దికుంట వద్ద జాతీయ రహదారిపై కర్ణాటక ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బస్సు జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనలపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.