హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పట్టణాలను సుందరీకరించేందుకు తెలంగాణ ఆర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) కృషి చేస్తున్నది. టీయూఎఫ్ఐడీసీ అందించిన నిధులతో పట్టణాలను అందమైన, అహ్లాదకరమైనవిగా తీర్చిదిద్దడానికి దోహదం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక పట్టణాలను అభివృద్ధి పర్చడానికి అవసరమైన సాయం అందించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 128 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు రూ.4,739.24 కోట్లను అందించారు.
వేగంగా జరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో భారీగా నిధులను ఖర్చు చేస్తున్నా రు. పట్టణాలు, నగరాల అభివృద్ధి పనులకు రూ.4,230కోట్లు, ఎఫ్ఎస్టీపీలకు రూ.227 కోట్లు, ఆధునిక దోబీఘాట్లకు రూ.282 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో సెంట్రల్ లైటింగ్, అర్బన్ లాంగ్ స్పేసెస్, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, డ్రెయిన్లు, లింక్ రోడ్లు, తదితర అభివృద్ధి పనులను చేపట్టారు.