హైదరాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల స్వీకరణపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని టీటీడీ ఈవో శ్యామలారావు పేర్కొన్నారు. ఈ అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు వదంతులేనని, భక్తులెవరూ నమ్మొద్దని వెల్లడించారు. వారానికి రెండురోజులు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలను అనుమతిస్తున్నట్టు గత రెండ్రోజులుగా వార్తలు వైరల్ అయ్యాయి. కాగా, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలను అనుమతించకపోవటంపై గత కొన్నిరోజులుగా తెలంగాణ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్న విషయం తెలిసిందే.