హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): శ్రావణమాసంలో టీఎస్ఆర్టీసీ సరికొత్త టూర్ ప్యాకేజీలను ప్రవేశపెడుతున్నది. తొలుత కర్ణాటకలోని గానుగాపూర్, మహారాష్ట్రలోని పండరీపూర్, తుల్జాపూర్ సందర్శించేలా కొత్త టెంపుల్ పిలిగ్రిమ్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ నెల 31న హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి సాయంత్రం 6 గంటలకు ఈ ప్రత్యేక బస్సు సర్వీస్ బయలుదేరి వెళ్తుంది. అదేరోజు రాత్రి 11.30 గంటలకు గానగాపూర్కు చేరుకుంటుంది.
దత్తాత్రేయుడి దర్శనానంతరం మరుసటిరోజైన ఆగస్టు 1న సా యంత్రం 4 గంటలకు పండరీపూర్‌కు చేరుకుంటుంది. పండరీనాథుడి దర్శనానంతరం మరుసటి రోజైన ఆగస్టు 2న మధ్యాహ్నం 12.30 గంటలకు తుల్జాపూర్‌కు చేరుకుంటుంది. అక్కడి తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకొన్న తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తిరుగు ప్రయాణమై, రాత్రి 8.30 గంటలకు ఎంజీబీఎస్‌కు చేరుకుంటుంది. ఈ టూర్ ప్యాకేజీ కింద ఒక్కొక్కరికీ రూ.2,500 చొప్పున చార్జీ ఉంటుంది. http// tsrtconline.in వెబ్సైట్ ద్వారా భక్తులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.