TSPSC | హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పరీక్షల మేళా నడుస్తున్నది. రాష్ట్రంలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటివరకు 17,285 ఉద్యోగాలకు 26 నోటిఫికేషన్లు ఇచ్చింది. ఏడు నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించింది. టీఎస్పీఎస్సీలో కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పరీక్షలకు తాత్కాలిక బ్రేక్ పడింది. మార్చి, ఏప్రిల్లో నిర్వహించాల్సిన పరీక్షలను కమిషన్ వాయిదా వేసింది. గతంలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షతోపాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ),డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో), అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షలను రద్దు చేసింది. ఆయా పరీక్షలను మళ్లీ నిర్వహించనున్నది. వీటిలో కొన్నింటికి ఇప్పటికే తేదీలను ప్రకటించింది. మరో రెండు, మూడు పరీక్షల తీదీలను ఈ వారం ప్రకటించే అవకాశం ఉన్నది.
మే నుంచి వరుస పరీక్షలు
మే నెల నుంచి వరుసగా పోటీ పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇప్పటికే మే నెలలో ఐదు పరీక్షలు నిర్వహించేందుకు తేదీలను ప్రకటించింది. జూలై 1న గ్రూప్-4, ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నది. గ్రూప్-3 పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నది. మే నుంచి డిసెంబర్ వరకు వరుసగా వివిధ పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ప్రణాళిక రూపొందించింది. అయితే, మే లో తెలంగాణలో సెట్ పరీక్షలతోపాటు సివిల్స్ ప్రిలిమ్స్, జూన్లో జేఈఈ అడ్వాన్స్ యూజీ సెట్, ఐఈఎస్, జియోసైంటిస్ట్, ఇంజినీరింగ్ సర్వీసెస్ మెయిన్స్, సీఏ ఇంటర్, జూలైలో యూపీఎస్సీ, కంబైన్డ్ మెడికల్, ఆగస్టులో సెంట్రల్ ఆర్ముడ్ ఫోర్సెస్, ఐబీపీఎస్, సెప్టెంబర్లో ఐబీపీఎస్ క్లర్క్, ఎన్డీఏ, సీడీఎస్, ఆర్ఆర్బీ, సివిల్స్ మెయిన్స్, అక్టోబర్లో ఐబీపీఎస్తోపాటు యూపీఎస్సీ, నవంబర్లో ఐఎఫ్ఎస్ మెయిన్స్, డిసెంబర్లో మిలిటరీ కళాశాల ప్రవేశ పరీక్ష, యూపీఎస్సీ పరీక్షలు, ఐబీపీఎస్ స్పెషలిస్టు పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నది.
ప్రిపరేషన్లో అభ్యర్థులు
టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో ప్రతిపక్షాలు అభ్యర్థులను గందరగోళంలో పడేసేందుకు విశ్వప్రయత్నం చేశాయి. టీఎస్పీఎస్సీలో ఇద్దరు చేసిన తప్పును పావుగా వాడుకుని రాజకీయ స్వార్థంతో అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకోవాలని చూశాయి. అయినప్పటికీ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచిన ఎక్కువమంది అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షాల వలలో చిక్కినవారు కొంత వెనుకబడిపోయారు. ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా.. కమిషన్ తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. వరుసగా పరీక్ష తేదీలను ప్రకటించడంతో అభ్యర్థుల్లో నెలకొన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ప్రశ్నపత్రాల లీకేజీని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో అభ్యర్థుల్లో మనోధైర్యం పెరిగింది. పెద్దఎత్తున నోటిఫికేషన్లు రావడంతో ఎలాగైనా సర్కారీ కొలువు కొట్టాలన్న పట్టుదలతో ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు.
కొత్త నిపుణులు.. కొత్త ప్రశ్నలు
టీఎస్పీఎస్సీలో కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన నేపథ్యంలో కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. మే నుంచి నిర్వహించబోయే ప్రతి పరీక్షకూ కొత్తగా ప్రశ్నలు సిద్ధం చేస్తున్నది. సాధారణంగా ప్రశ్నల ఎంపికకు కొంతమంది సబ్జెక్టు నిపుణులు ఉంటారు. ఎవరెవరు పనిచేస్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? వంటివన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు. సబ్జెక్ట్ నిపుణులకు సైతం ఒకరితో మరొకరికి సంబంధం ఉండదు. అయితే, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రశ్నపత్రాలన్నీ మార్చేయాలని నిర్ణయించిన టీఎస్పీఎస్సీ.. సబ్జెక్టు నిపుణులను సైతం మార్చాలని భావిస్తున్నది. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టింది.
టీఎస్పీఎస్సీ ప్రకటించిన వివిధ పరీక్షల తేదీలు