హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యుత్తమ పద్ధతుల్లో హరిత పారిశ్రామికవాడల (గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ల) ఏర్పాటుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ)తో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరుగుతున్న గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా శనివారం టీఎస్ఐఐసీ వైస్‌చైర్మన్, ఎండీ వెంకట నర్సింహారెడ్డి, ఐజీబీసీ హైదరాబాద్‌శాఖ చైర్మన్ శేఖర్‌రెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
దీనిలో భాగంగా దేశంలోనే అత్యుత్తమ పర్యావరణ అనుకూల పారిశ్రామికవాడల నిర్మాణానికి అవసరమైన విధానాల రూపకల్పనతోపాటు గ్రీన్ బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా నూతన పారిశ్రామికవాడల ఏర్పాటుకు ఐజీబీసీ తగిన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తుంది. ఇందుకు అవసరమైన ప్రణాళికలను ఐజీబీసీ సాంకేతిక నిపుణులు అందిస్తారు. పారిశ్రామికవాడల చుట్టూ బఫర్‌జోన్‌ను ఏర్పాటు చేయడం, కనీ సం 30% స్థలాన్ని పచ్చదనం కోసం కేటాయించడం, ఇప్పటికే ఉన్న పారిశ్రాకవాడలను గ్రీన్ బిల్డింగ్ విధానాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు కొత్తగా ఏర్పాటుచేసే 40 పారిశ్రామికవాడల్లో భవనాల నిర్మాణం మొదలుకొని మౌలిక సదుపాయల కల్పన వరకు అన్ని పనుల్లో సుస్థిర విధానాలను అమలు చేసేందుకు ఐజీబీసీ తగిన సహకారాన్ని అందిస్తుంది.