హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే తెలంగాణ పోలీసు ఎంతో ఉత్తమమని అనేకసార్లు రుజువైంది. ఈసారి తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో (టీఎస్ఎఫ్పీబీ) ప్రతిభను చాటింది. ఆలిండియా స్థాయిలో జరిగిన పరీక్షలో టాప్-30లో తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో 24 ర్యాంకులు సొంతం చేసుకున్నది. సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో (సీఎఫ్పీబీ), నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నిర్వహించిన ఆల్ ఇండియా బోర్డ్ ఎగ్జామినేషన్-2023లో తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో ప్రతిభ చూపింది. దేశవ్యాప్తంగా ఫింగర్ ప్రింట్ బ్యూరోలో పని చేస్తున్న పోలీసులకు ఆగస్టు 19, 20, 21వ తేదీల్లో ఢిల్లీలో పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో టాప్ 10 ర్యాంకుల్లో 9 ర్యాంకుల్లో తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు చెందిన ఏఎస్సైలే సొంతం చేసుకున్నారు.