Cyber Crime | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : ‘హలో నేను ముంబై నుంచి పోలీస్ ఆఫీసర్. మీరు మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు. మీపై వారెంట్ పెండింగ్లో ఉంది’ అంటూ బుధవారం రాత్రి స్కైప్ వీడియో కాల్లో ఓ మహిళను బెదిరించాడో సైబర్ నేరగాడు. ఈ కేసు నుంచి తప్పించాలంటే రూ.లక్షల్లో కావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. దీంతో ఆమె సైబర్ నేరగాడు చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ.60లక్షలు పంపింది.
చేయని తప్పునకు తానేందుకు డబ్బులు కట్టాలనే ఆలోచనతో నిమిషాల్లోనే అప్రమత్తమైన బాధితురాలు 1930కి కాల్ చేసింది. వెంటనే స్పందించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బంది లావాదేవీల వివరాలను సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసి, ఎస్బీఐని అప్రమత్తం చేశారు. దీంతో వారు నిమిషాల వ్యవధిలోనే ఆ నగదును బదిలీ కాకుండా నిలిపివేశారు.
‘గోల్డెన్ అవర్’లోనే స్పందించడం వల్ల బాధిత మహిళ తన డబ్బును పూర్తిగా తిరిగిపొందేందుకు అవకాశం దొరికిందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ వెల్లడించారు. నగదు సైబర్ దొంగలకు వెళ్లకుండా కాపాడిన ఎస్ఐ శిరీష, కానిస్టేబుళ్లు రెహమాన్, కృష్ణను ఏడీజీ అభినందించారు. సైబర్ నేరాలు జరిగినప్పుడు నిమిషాల వ్యవధిలోనే 1930కి కాల్ చేయాలని, లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయాలని సూచించారు.