TS UTF | హైదరాబాద్ : సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో అవసరానికి మించి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని పేర్కొంటూ సొసైటీ కార్యదర్శి సీనియర్ ఉపాధ్వాయులను అదనపు ఉపాధ్యాయులుగా గుర్తించి హడావుడిగా బదిలీకి ఆదేశాలివ్వడాన్ని టీఎస్ యుటీఎఫ్ తీవ్రంగా ఖండించింది.
రేషనలైజేషన్ నిబంధనల ప్రకారం అదనపు ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సిన సందర్భంలో సీనియర్ల అంగీకారం తీసుకోవాలి. బలవంతంగా బదిలీ చేయాల్సి వస్తే జూనియర్లను మాత్రమే బదిలీ చేయాలి. కానీ ఏకపక్షంగా రాత్రికి రాత్రే సీనియర్ టీచర్లతో లిస్ట్ విడుదల చేసి తెల్లవారేసరికి కౌన్సిలింగ్కు రమ్మని పిలవటం సమంజసంగా లేదు. అదనపు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే సందర్భంలో రీ డిప్లాయ్మెంట్ నిబంధనలు పాటించి సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
వివిధ జిల్లాల నుండి వచ్చిన బాధిత ఉపాధ్యాయులు మంగళవారం మధ్యాహ్నం సేవాలాల్ బంజారాభవన్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. వారి ఆందోళనకు టిఎస్ యుటిఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కే జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు.