హైదరాబాద్ : భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రీజినల్ రింగ్ రోడ్డు(RRR) అలైన్మెంట్ ఉండాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Batti Vikramarka ), మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati reddy) అధికారులకు సూచించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన 2024-25 వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశంలో వివిధ రోడ్లు(Roads), భవనాలు(Buildings), రైల్వే బ్రిడ్జిలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనలపై ఆ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు.
ఇష్టం వచ్చినట్టుగా కాకుండా క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఆలైన్మెంట్ (Alignment) ఉండాలని సూచించారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. భూసేకరణకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, నల్గొండ, హైదరాబాద్ లో కలెక్టరేట్ల నిర్మాణాలు చేపట్టడం, రాష్ట్రంలో ఆర్వోబీలు, ఆర్ యూబీలు, వీయూబీ బ్రిడ్జ్ ల నిర్మాణానికి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు కేటాయించాలని అధికారులకు ఆదేశించారు.
నంది అవార్డులపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం..
సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కాపాడాలని అధికారులను ఆదేశించారు. సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ వంటి మహమ్మారి వ్యసనాల వ్యతిరేక ప్రచారంలో సినిమా సెలబ్రిటీలు పాల్గొనే విధంగా ఒప్పించే ప్రయత్నం చేయాలని తెలిపారు. నంది అవార్డు(Nandi Awards) లపై క్యాబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సినిమా టికెట్ల కంటే థియేటర్లో అమ్మే చిరుతిళ్లకు వందరేట్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయని వాటిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుందామని తెలిపారు.