రామగిరి, జనవరి 28 : రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ‘టీఎస్ ఐసెట్-2026’ షెడ్యూల్ విడుదలైంది. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో జరిగిన సమావేశంలో షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్ష బాధ్యతలను ఉన్నత విద్యా మండలి నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి అప్పగించింది. టీఎస్ ఐసెట్ కన్వీనర్‌గా ఎంజీయూ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ సీనియర్ ప్రొఫెసర్, యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ అల్వాల రవి నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, వివిధ యూనివర్సిటీల వీసీలు, వివిధ సెట్స్ కన్వీనర్లు పాల్గొన్నారు.
– ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ విడుదల
– ఫిబ్రవరి 12 నుండి ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం
– మార్చి 16 వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ సమర్పణకు చివరి గడువు
– ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.550 ఆన్లైన్లో చెల్లించాలి
– ఇతర అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులకు రూ.750
– ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు మే 13, 14న కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు.
తెలంగాణ వ్యాప్తంగా టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్షలు నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగానే అర్హులైన అభ్యర్థులంతా సకాలంలో దరఖాస్తులను సమర్పించాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.