హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి పార్టీ ఫిరాయించేందుకు ప్రోత్సహించిన ముగ్గురు బీజేపీ దూతలను రిమాండ్‌కు తరలించాలని హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. నిందితులకు రిమాండ్ విధించడానికి ఏసీబీ కోర్టు నిరాకరించడాన్ని తప్పుపడుతూ.. ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. నిందితులు ముగ్గురూ పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. నేరస్మృతి (సీఆర్పీసీ) నిబంధనలకు అనుగుణంగా వారి అరెస్ట్ ఉంటే ఏసీబీ కోర్టు ముగ్గురు నిందితులను రిమాండ్‌కు పంపాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూరు సుమలత శనివారం ఉత్తర్వులు జారీచేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురికి డబ్బు ఎర చూపి వారిని బీజేపీలో చేర్చేందుకు ముగ్గురు నిందితులు రామచంద్రభారతి (సతీష్ శర్మ వీకే), కోరె నందకుమార్ (నందు) డీపీఎస్‌కేవీఎన్ సింహయాజి చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్లను మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిస్తే.. 41ఏ నోటీసు ఇవ్వలేదని చెప్పి రిమాండ్‌కు పంపేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. దీనిని సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాలు చేశారు.
అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల్లో 41ఏ నోటీసు నిందితులకు కచ్చితంగా ఇవ్వాలని లేదని హైకోర్టు స్పష్టం చేసింది. 41ఏ నోటీసు ఇవ్వలేదని చెప్పి రిమాండ్‌ను తిరస్కరించడం చెల్లదని పేర్కొంది. సీఆర్పీసీలోని 41(బీ) ప్రకారం దర్యాప్తు అధికారి సంతృప్తి చెందతే మేజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వులు జారీచేయాలని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీసులు దాఖలుచేసిన రివిజన్ పిటిషన్‌కు విచారణార్హత ఉందని పేర్కొంది. ‘ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభపెట్టడం కోసం నిందితులు ఎమ్మెల్యేలతో మొయినాబాద్ ఫాంహౌస్‌లో సమావేశం కావడం, కొబ్బరినీళ్లు తీసుకురా అనే సంకేతం తర్వాత పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడున్న నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు, పత్రాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ రిమాండ్ రిపోర్టులో ఉన్నాయి. వీటిని పరిశీలించకుండా 41ఏ నోటీసు ఇవ్వలేదని చెప్పి నిందితులను విడిచిపెట్టడం సరికాదు.
నిందితుల గురించి విశ్వసనీయ సమాచారం ఉన్నప్పుడు, వారు ఇతరులను ప్రలోభాలకు గురిచేస్తారనే అనుమానం కలిగినప్పుడు, ఏడేండ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో కూడా నిందితులను పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. ఈ నిబంధనను కింది కోర్టు విస్మరించింది. ఏదైనా ఫిర్యాదు అందితే పోలీసులు ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. కొన్ని కేసుల్లో అరెస్టు చేయకపోవచ్చు. ఈ కేసులో నిందితుల గురించి సమగ్రంగా రిమాండ్ రిపోర్టులో ఉన్నది. 41ఏ నోటీసు ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంగా రిమాండ్‌కు తరలించకపోవడం చట్ట వ్యతిరేకం. అందుకే ముగ్గురు నిందితుల రిమాండ్‌కు తిరిస్కరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదుట ముగ్గురు నిందితులు లొంగిపోవాలి. ఒకవేళ లొంగిపోకపోతే నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చాలి. సీఆర్పీసీలోని 50ఏ, 51, 54 నుంచి 57 సెక్షన్లు అన్నింటినీ మేజిస్ట్రేట్ పరిశీలించాక ముగ్గురు నిందితుల రిమాండ్‌కు ఉత్తర్వులు జారీ చేయాలి. క్రిమినల్ కోడ్ ప్రొసీజర్స్ ప్రకారం మేజిస్ట్రేట్ రిమాండ్ ఆదేశాలు జారీ చేయాలి’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూరు సుమలత పేర్కొన్నారు.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వినిపించిన వాదనలను హైకోర్టు ఆమోదించింది. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు, ఆయనతో వచ్చే ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇస్తామని, టీఆర్ఎస్కు రాజీనామా చేయాలని ముగ్గురు నిందితులు ప్రతిపాదించటం తీవ్రమైన అభియోగాలని పేర్కొన్నారు. నాలుగు రహస్య కెమెరాలు, రోహిత్‌రెడ్డి జేబులోని రెండు వాయిస్ రికార్డర్లు వంటి సాక్ష్యాధారాలు ఉన్నాయని, రిమాండ్ రిపోర్టులోని కీలక విషయాలను మేజిస్ట్రేట్ పూర్తిగా విస్మరించి 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్‌కు తరలించకపోవడం చెల్లదని అన్నారు. రోహిత్‌రెడ్డికి రూ.100 కోట్లు, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు రూ.50 కోట్లు చొప్పున ఇస్తామని ప్రలోభాలకు గురిచేయడం అవినీతి కిందకే వస్తుందని తెలిపారు. ముగ్గురు నిందితులు తాము బీజేపీకి చెందినవాళ్లమని చెప్పుకున్నారని, ఈడీ, సీబీఐ కేసులు లేకుండా చూస్తామని వాళ్లు భరోసా ఇచ్చారంటే వాళ్ల వెనుక ఉన్న పెద్దలు ఏ స్థాయి వాళ్లో అర్ధం చేసుకోవాలని కోరారు. తీవ్ర అభియోగాలను కింది కోర్టు చాలా తేలిగ్గా తీసుకొని రిమాండ్‌కు పంపలేదన్నారు. నిందితులను వదిలేస్తే సాక్ష్యాధారాలు తారుమారు అవుతాయని చెప్పారు. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.