హైదరాబాద్ : వరంగల్‌లో ఈ నెల 29న టీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభాస్థలం ఖరారైంది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ద్విదశాబ్ది వేడుకలను వైభవంగా జరుపాలని పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. సభా ఏర్పాట్ల కోసం సన్నాహక సమావేశాలు నిర్వహించి, పార్టీ శ్రేణులను సమాయత్తపరిచే బాధ్యతను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో గత నెల 18 నుంచి రోజుకు 20 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున 103 నియోజకవర్గాల ముఖ్యనేతల మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో ముఖ్యనేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
మరో వైపు సీఎం కేసీఆర్ వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతీ రాథోడ్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి తదితరులకు సభా నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ముందుగా ఈనెల 15న నిర్వహించాలని అనుకున్నా వరంగల్ నేతలు స్థానికంగా నెలకొన్న పరిస్థితులతోపాటు టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమానికి నవంబర్ 29కి ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఆ తేదీనే సభ నిర్వహించాలని వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను కోరడటంతో సభ దీక్షా దివస్ (ఈనెల 29)కి వాయిదా పడిన విషయం తెలిసిందే.
హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేట గ్రామశివారులో దాదాపు 350 ఎకరాల స్థలాన్ని సభా నిర్వహణకు స్థలాన్ని గుర్తించారు. తెలంగాణ విజయగర్జన సభకు గ్రామానికో బస్సు తరలిరావాలని, ఆ బస్సులో పార్టీ కమిటీల సభ్యులతోపాటు ఆయా గ్రామాల్లో సభకు స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు ఏ కమిటీ స్థాయిలో ఆ కమిటీ చేసుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సభకు తరలే వాహనాలను దృష్టిలో పెట్టుకొని సభాస్థలికి ఇరువైపులా దాదాపు 900 ఎకరాల స్థలాన్ని నేతలు గుర్తించారు. హైదరాబాద్ – భూపాలపట్నం జాతీయ రహదారి (163)ని ఆనుకొని ఉండటంతోపాటు సభానిర్వహణ వల్ల వరంగల్, హన్మకొండ సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. అయితే అంతకుముందు వరంగల్-ఖమ్మం రహదారి మధ్య, మడికొండ-కడిపికొండ గ్రామాల్లో మధ్య స్థలాన్ని పరిశీలించారు. ఆ రెండు స్థలాలు వరంగల్, హన్మకొండ పట్టణాల మధ్య ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశంతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వారికి కూడా ఇబ్బందులు కలుగుతాయని దేవన్నపేటను నేతలు ఖరారు చేశారు.
టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించే సభ కనుక పార్టీ శ్రేణులకు ఈ సభ మరచిపోలేని అనుభూతిని ఇచ్చేవిధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను ఆదేశించారు. దీంతో సభా నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ విజయవంతం కోసం పలు కమిటీలు వేశారు.
సభాస్థలి చదును కోసం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, పార్టీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, సభా ప్రాంగణం కమిటీకి టీఐసీసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, అలంకరణ కమిటీ బాధ్యతలను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. అయితే ఇవి తాత్కాలికంగా వేసిన కమిటీలేనని రెండు మూడు రోజుల్లో పార్టీ నేతలతో సమావేశమై మిగితా కమిటీలు వేసి అందరి సమన్వయంతో తెలంగాణ విజయగర్జన సభను విజయవంతం చేస్తామని ఆయన చెప్పారు.