వరంగల్: దేశంలోని యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని కాపాడాలని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కేంద్ర సర్కారును కోరారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు, రాష్ట్రం ఆధ్వర్యంలో నడుస్తున్న వర్సిటీల అటానమస్ను లాక్కునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. విశ్వవిద్యాలయాల సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ 2020)ను డబ్ల్యూటీవో ఆధారిత పాలసీ అని అభిప్రాయపడ్డారు.
కాకతీయ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన *భారతదేశంలో ఉన్నత విద్య-అవకాశాలు-సవాళ్లు-పరిష్కారాలు* అనే అంశంపై జరిగిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభ సెషన్లో ఆయన కే కేశవరావు మాట్లాడారు. కేంద్రం అవలంబించిన విధానాల వల్ల భారతదేశంలో చాలా మంది విద్యార్థులు ఉన్నత విద్యను పొందలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరముందని కే కేశవరావు పేర్కొన్నారు. వర్సిటీల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవనీ, బోధన, బోధనేతర సిబ్బంది కొరత వేధిస్తోందని చెప్పారు. 200 విదేశీ యూనివర్సిటీలను భారత్కు ఆహ్వానించాలన్న కేంద్రం నిర్ణయం, ప్రభుత్వ ఆధ్వర్యంలోని వర్సిటీలపై ఆధిపత్యం కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై ఆయన విమర్శలు గుప్పించారు. కాగా, పీవీ నరసింహారావు నాలెడ్జ్ సెంటర్ కోసం రూ.3.5 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.