న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ధాన్యం కొనిపించేందుకు గులాబీ దండు హస్తినకు కదులుతున్నది. సోమవారం ఢిల్లీలోని తెలంగాణభవన్ వేదికగా నిర్వహించనున్న దీక్షకు టీఆర్ఎస్ శ్రేణులు తరళి వెళ్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకొన్నారు. మిగిలినవారంతా ఆదివారం సాయంత్రానికి ఢిల్లీకి చేరుకొనేలా ఏర్పాట్లు చేసుకొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల కోసం తెలంగాణ భవన్‌తోపాటు చుట్టుపక్కల హోటళ్లలో వసతి ఏర్పాట్లుచేశారు. ధర్నాలో పాల్గొనేవారందరికీ తెలంగాణ భవన్లో భోజన వసతి కల్పిస్తున్నారు. దీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్రావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గోపీనాథ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ తదితరులు దీక్షా వేదిక ఏర్పాటు పనులను శనివారం పరిశీలించారు.
దీక్షలో పాల్గొనేవారికి ఏ ఇబ్బందీ రాకుండా చర్యలు తీసుకొంటున్నారు. వేదిక, పార్కింగ్, భోజనం, విమానాశ్రయం నుంచి దీక్షా స్థలికి చేరుకొనేందుకు వాహనాల ఏర్పాటు తదితర పనులకు ఉప కమిటీలు నియమించారు. భోజన ఏర్పాట్ల కమిటీలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, టీఆర్ఎస్ నేత బండి రమేశ్ ఉన్నారు. వీరు ఆది, సోమవారాలకు సంబంధించిన పూర్తి భోజన ఏర్పాట్లను చూస్తున్నారు. వసతి, వాహన సదుపాయాల కోసం టీఆర్ఎస్ శాసన సభాపక్ష కార్యాలయ కార్యదర్శి రమేశ్‌రెడ్డిని నియమించారు. విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చేవారి కోసం పది బస్సులు, 35 కార్లు సమకూర్చారు. ఆదివారం సాయంత్రానికి సభా వేదిక నిర్మాణం పూర్తి చేయనున్నారు.
ఢిల్లీలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ దీక్షపైనే చర్చ కనిపిస్తున్నది. నగరం ప్రధాన కూడళ్లలో దీక్షకు సంబంధించి పెద్ద ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. హిందీ, ఇంగ్లిష్‌లో ‘టీఆర్ఎస్ డిమాండ్లు, ఒక దేశం ఒకే ధాన్యం సేకరణ విధానం తదితర పేర్లతో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. కొంత మంది రైతు ప్రేమికులు దీక్షకు మద్దతుగా రిక్షాలపై కూడా ప్రచారం చేపట్టారు. కాయస్త రామ్ ప్రతాప్ రాయ్ శ్రీవాస్తవ్ అనే కేసీఆర్ అభిమాని ‘సునెహరా తెలంగాణ’ పేరుతో తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఆటోలో ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
తెలంగాణ నుంచి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ధాన్యాన్ని సేకరించేదాకా కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. రైతులను ఎలా కాపాడుకోవాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కు తెలుసని అన్నారు.
తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు పంజాబ్‌కు వెళ్లి అదేమాట చెప్పే ధైర్యం ఉన్నదా అని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. పంటల సేకరణలో జాతీయ విధానం ఉండాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టంచే శారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు నూకలు చెల్లిస్తామని హెచ్చరించారు.
కేంద్రంతో వడ్లు కొనిపిస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి పోయారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులపై బీజేపీకి ఏమాత్రం ప్రేమలేదని విమర్శించారు. యాసంగి వడ్ల విషయంతో బీజేపీ నేతల ఉత్తర కుమార ప్రగల్భాలు బయటపడ్డాయని ఎద్దేవా చేశారు.
రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, రైతుల కష్టాలను దేశ ప్రజలకు వెల్లడించేందుకే దీక్ష చేపట్టామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు చెప్పారు. శనివారం దీక్షా స్థలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏటా లక్షల టన్నుల బాయిల్ రైస్, నూకలను ఎగుమతి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ధాన్యం ఎందుకు సేకరించదని ప్రశ్నించారు. రైతుల్లో ప్రత్నామ్నాయ పంటలపై అవగాహన వచ్చే వరకు, పంటల మార్పిడి జరిగే వరకు కేంద్రం సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నా పట్టించుకోకపోవడంతోనే నిరసన తెలపాల్సి వస్తున్నదని చెప్పారు.