హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్రంతో వడ్లు కొనిపించటం చేతకాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడితే తరిమికొడ్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. బిడ్డా.. బండి సంజయ్ ఒళ్లు దగ్గరపెట్టుకో అని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. సంజయ్ ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిననే సోయి మరిచి, ఇంగితం కోల్పో యి దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం టీఆర్ఎస్ ఎల్పీలో విప్ గువ్వల బాలరాజు, పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఉత్తరభారత నేతల బూట్లు నాకి రాష్ట్ర అధ్యక్ష పదవి తెచ్చుకొన్న బండి సంజయ్‌కు వడ్లకు, గోధుమలకు తేడా తెలియదని పల్లా ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ ఢిల్లీలో రాష్ట్ర రైతాంగం కోసం నిరసన దీక్ష చేస్తే, పీఎంవో ఆదేశాలతో హైదరాబాద్‌లో బీజేపీ పోటీగా దీక్ష చేపట్టడం సిగ్గుచేటన్నారు. ధాన్యం కొనుగోళ్లు రాష్ట్ర పరిధిలో ఉండవనే కనీస జ్ఞానం లేని అజ్ఞాని అని ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రజలను నూకలు తినాలని వాళ్ల కేంద్ర మంత్రి అవమానిస్తే, చీమూనెత్తురు లేని బండి ఖండించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎనిమిదేండ్లుగా ఓపికతో ఉన్నామని, ఇకపై బీజేపీ ఒక్కటంటే తాము వంద అంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని బండి బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారని, రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్రమంత్రి తోమర్ పార్లమెంట్లో చెప్పారని గుర్తుచేశారు. ఎంపీగా బండి సం జయ్ ఏం సాధించిందేంటని ప్రశ్నించారు. దమ్ముంటే తనపై ఐటీ, సీబీఐ, ఈడీ సోదాలు చేసుకోవాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ నాయకులను ఉరికిస్తామని బండి చెప్తుతున్నారని, నల్లగొండ, సూర్యాపేట, ఆర్మూర్‌లో బీజేపీని ఉరికిచ్చి కొట్టామని గుర్తుచేశారు.
రెండు సీట్లు రాగానే రెచ్చిపోయి బీజేపీ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారని విప్ గువ్వల బాలరాజు మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగం కోసం రాహుల్‌గాంధీతో ఢిల్లీలో దీక్ష చేయించాలని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరా రు. బీజేపీ అంటే బుద్ధి, జ్ఞానం లేని పార్టీ అని..దొంగ బీజేపీపై ఇక టీఆర్ఎస్ దంగల్ చేస్తుందని పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. మదమెక్కిన బీజేపీపై టీఆర్ఎస్ కదం తొక్కుడేనని అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ సరసన ఎఫ్‌సీఐని బీజేపీ చేర్చిందని.. ఎఫ్‌సీఐ అంటే ఫ్రాడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని వర్ణించారు. నిజామాబాద్ జిల్లాలో ఆగ్రహించిన రైతులు ఎంపీ అర్వింద్ ఇంటి ముందు వడ్లు పోసి నిరసన తెలిపారని, నూకలు తినాలన్న పీయూష్ గోయల్ పీక పట్టుకొనే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పారు. అడ్డగోలుగా మాట్లాడితే బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరగనీయబోమని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్న ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటన్నా ఊరుకోబోమన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): అన్నదాతలకు ఎలాంటి కష్టమెచ్చినా ఆదుకొనే రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. యాసంగి వరి ధాన్యం కొనబోమని కేంద్రంలోని బీజేపీ సర్కారు సిగ్గులేకుండా చెప్పిన నేపథ్యంలో రైతన్న ఆగం కావొద్దని గొప్ప మనసుతో చివరిగింజ వరకు కొంటామని కేసీఆర్ చెప్పడం హర్షణీయమని పేర్కొన్నారు. బీజేపీ నేతల కుటిల రాజకీయాలను అర్ధం చేసుకోవాలని రైతులకు సూచించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకొనేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు అన్నారు. యాసంగి వడ్లను కొనమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బరితెగించి చెప్పినా రాష్ట్ర రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని, అన్నం పెట్టే రైతన్న ఆగం కావొద్దని ప్రతిగింజా కొంటామని ముఖ్యమంత్రి చెప్పారన్నారు.