నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. ఇదిలావుంటే పల్లె వాసులు సైతం టీఆర్ఎస్కు జై కొడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ఉన్న పల్లె ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కుమార్కే ఓటు వేస్తామని ప్రకటిస్తున్నారు. ఓట్లన్నీ గంపగుత్తగా కారుకే వేయాలని త్రిపురారం మండలంలోని పలు గ్రామాల వారు గురువారం తీర్మానించారు.
సత్యంపహాడ్ తండాలో ఇలా..
త్రిపురారం మండలంలోని సత్యంపహాడ్ తండా గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది. ఇక్కడ 632 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఊర్లో భూమి ఉన్న ప్రతి ఒక్కరూ రైతుబంధు లబ్ధిదారులే. దీంతోపాటు ఏదో ఒక ప్రభుత్వ పథకం ప్రతీ తలుపు తట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. దీనికితోడు గ్రామపంచాయతీ భవనం, సీసీరోడ్ల నిర్మాణం, ఇంటింటికీ నల్లా నీరు, పల్లె ప్రగతితో పారిశుద్ధ్యం ఇలా అనేక కార్యక్రమాలు ఇక్కడ అమలవుతున్నాయి. ఈ గ్రామ పంచాయతీలోని మూడు తండాల జనమంతా ఒక్కచోటకు చేరారు. దశాబ్దాలుగా ఇతర పార్టీలకు ఓట్లేస్తే జరిగిన ప్రయోజనం ఏమీ లేదని, టీఆర్ఎస్ పాలనలోనే అన్ని పథకాలు గ్రామంలోకి వచ్చాయన్న భావనతో అందరూ ఏకమయ్యారు. ఈ గ్రామ పంచాయతీలో మొత్తం 145 కుటుంబాలు ఉండగా అందులో 20 కుటుంబాల వరకు కాంగ్రెస్‌కు చెందినవి ఉన్నాయి. వీరు కూడా ఉప ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి వైపు నిలిచేందుకు ముందుకొచ్చారు. పార్టీని వదిలి టీఆర్ఎస్కు జై కొట్టారు. ఇదే విషయాన్ని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్ నాయక్ ద్వారా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు తెలిపారు.
రాజేంద్రనగర్ వాసులు సైతం..
ఇదే మండలంలోని రాజేంద్రనగర్ కూడా ఇటీవలే కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడింది. వీరు కూడా సమావేశమై టీఆర్ఎస్కే తమ ఓట్లని ప్రకటించారు. ఇక్కడ మొత్తం 536 మంది ఓటర్లు ఉండగా అందరూ కారు గుర్తుకు జైకొట్టారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న పథకాల లబ్ధిదారులు తమ ఊరిలో ఇంటికొక్కరు ఉన్నారని సర్పంచ్ వెంకట్‌రెడ్డి తెలిపారు. అభివృద్ధికే తమ ఓటు అంటూ వీరు ఎమ్మెల్యే శంకర్‌నాయక్, రైతుబంధు సమితి అధ్యక్షుడు రాంచందర్ నాయక్ సమక్షంలో తమ నిర్ణయాన్ని ప్రకటించారు. చాలా పల్లెల్లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపుతున్నారు. త్రిపురారం మండలంలోని లచ్యాతండా ఆవాస గ్రామమైన బీస్యాతండా వాసులు సైతం సర్పంచ్ మంగ్తానాయక్ సమక్షంలో టీఆర్ఎస్కే ఓటు వేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.
టీఆర్ఎస్కు పలు సంఘాల మద్దతు
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా పలు సంఘాల వారు టీఆర్ఎస్ పక్షాన నిలుస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్ వెంటే ఆర్యవైశ్యులు ఉంటారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తెలిపారు.
నోములకే బీసీ సంఘాల బాసట
హాలియా పట్టణంలో గురువారం ‘నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీసీల పాత్ర’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 33 కులాలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ కులాలకు చెందిన రాష్ట్ర నాయకులంతా సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతు ప్రకటించినట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా..
త్రిపురారం మండలంలోని వస్రాంతండాలో టీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచంద్రనాయక్ సమక్షంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు టీఆర్ఎస్కు ప్రకటించారు. అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపిస్తామన్నారు.