RRR | నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ)/చౌటుప్పల్: చౌటుప్పల్‌లో ట్రిపుల్ఆర్ భూ మాయం.. జంక్షన్.. టెన్షన్ పేరుతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో సోమవారం ప్రచురించిన ప్రత్యేక కథనం సంచలనం సృష్టించింది. దక్షిణభాగం అలైన్మెంట్లో భాగంగా చౌటుప్పల్‌లో జంక్షన్‌ను 181 ఎకరాలకు విస్తరించటంపై.. ప్రభుత్వ కోణాన్ని ఆవిష్కరిస్తూ, జిల్లా మంత్రి, ఎమ్మెల్యే తీరును ఎండగడుతూ, బాధితు ఆవేదన, ఆందోళనను కండ్లకు కడుతూ ప్రచురించిన కథనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిర్వాసితుల వాట్సాప్ గ్రూపుల్లో విస్తృతంగా షేర్ అయ్యింది. ఎంతోమంది స్టేటస్‌గా, డీపీగా పెట్టుకొని.. ప్రభుత్వానికి తమ గోడు వినిపించేలా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ షేర్ చేశారు. తెలంగాణ బిడ్డల ఆస్తులను ఫణంగా పెడుతూ ఇతర ప్రాంత ప్రయాణికుల విందు, వినోదాల కోసం జంక్షన్ విస్తరణ చేయటాన్ని అడ్డుకుంటామని బాధితులు చెప్తున్నారు. అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమని నిర్వాసితుల పక్షాన ట్రిపుల్ బాధిత సంఘం నాయకులు బూర్గు కృష్ణారెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ క్రమంలో బాధితులంతా కలిసి న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నట్టు తెలిసింది.
తెరపైకి కోమటిరెడ్డి వీడియోలు
ట్రిపుల్ ఆర్ బాధితులతో గతంలో ఎంపీగా ఉన్నపుడు, ఇప్పుడు మంత్రి అయ్యాక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యవహార శైలిపై ‘నమస్తే తెలంగాణ’ కథనంలో పేర్కొన్న అంశాలపై కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో రాయగిరి రైతుల పక్షాన మాట్లాడిన మాటలను మరోసారి వైరల్ అయ్యాయి. అలైన్మెంట్ మార్చుతామని, బాధితులకు బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పిన మాటలను బాధితులు సోషల్ మీడియా వేదికగా గుర్తుచేశారు. ‘ఆ డిపార్ట్మెంట్ నాదే.. రోడ్ నాదే.. అలైన్మెంట్ మార్చేద్దాం’ అని చెప్పిన వీడియోను వైరల్ చేశారు. ఇపుడేమో రైతులకు సమయం ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మూడు సార్లు భూములు తీసుకున్నరు
ఇప్పటికే మూడు సార్లు భూములు తీసుకున్నరు. అయినా సప్పుడు చేయలేదు. మళ్లీ ఇప్పుడు భూమి ఇవ్వుమంటున్నరు. మేం ఎట్ల బతకాలి? కాయకష్టం చేసుకుని చిన్నతనం నుంచి భూమిని నమ్ముకొని బతికినం. ప్రాణం పోయినా భూమి ఇచ్చేది లేదు. ఉన్న భూమిపోతే రోడ్డు మీద పడాల్సిందే. చూసే దిక్కు కూడా ఉండడు.
-జాల యాదయ్యయాదవ్, రైతు, చౌటుప్పల్
పాలకులు పట్టించుకోవడం లేదు
బాధితులకు ్యయం చేసే విషయం లో కాం గ్రెస్ పాలకులు ఏమా త్రం పట్టించుకోవటం లేదు. ఎన్నిసార్లు వెళ్లినా రైతులకు బహిరంగ ధర ఇప్పిస్తామని అన్నరు. ఇప్పుడు ఎవరూ సప్పుడు చేస్తలేరు. ఇక్కడ జంక్షన్ వస్తే చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండుగా చీలి అభివృద్ధి కూడా కుంటుపడుతుంది.
-గుండెబోయిన వేణుయాదవ్, రైతు, తంగడపల్లి
రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఎందుకు మార్చరు
దక్షిణ భాగం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని అంటున్నరు. మాది దక్షిణభాగమే కదా. జం క్షన్ మార్చే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు ఇక్కడి రైతులను పట్టించుకోరు? మా తరపున అడిగే పెద్దలు ఎవరూ లేరా?
-జాల జంగయ్య యాదవ్,రైతు, తంగడపల్లి
మా పిల్లల భవిష్యత్తు ఏంది?
కొన్నేండ్ల నుంచి పరిశ్రమల కాలుష్యం మూలంగా పంటలు పండటం లేదు. ఇప్పటికే ఎంతో ఆర్థికంగా నష్టపోయాం. అయినా భూమి ఉందన్న ధీమాతో కష్టం చేసుకుని బతుకు వెళ్లదీస్తున్నం. ఇప్పుడు రింగురోడ్డు అని భూమి గుంజుకుంటే ఎట్లా? ఉన్న భూమి పోతే మా పిల్లల భవిష్యత్తు ఏంది?
-జాల అంజయ్య యాదవ్, రైతు, చౌటుప్పల్