హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ షెడ్యూల్ తెగల ఆర్థిక సహకార సంస్థ (ట్రైకార్) 2023-2024 ఆర్థిక సంవత్సరానికి రూ.543.45 కోట్లతో చేపట్టే కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది. శుక్రవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్ (సంక్షేమభవన్)లో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో గిరివికాసం, సీఎంఎస్టీఈ, ఎంఎస్ఎంఈ, రైతు ఉత్పత్తి కేంద్రాలు తదితర విభాగాల ద్వారా ట్రైకార్ చేపట్టనున్న కార్యాచరణను ఆమోదించింది. గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అందులో భాగంగానే ట్రైకార్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని బోర్డు పేర్కొన్నది. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, జీఎం శంకర్రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.