Runa Mafi | ఆదిలాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ): పేరుకు ఐదెకరాలున్నా.. రాళ్లూ రప్పలు నిండి పంటలు పండని భూములవి.. వర్షం పడితే తప్ప సాగు చేసుకోలేని దైన్యమతడిది.. ఆ భూముల్లోనే పెట్టుబడి పెట్టి ఎలాగైనా పంటలు పండించి కష్టాల నుంచి గట్టెక్కాలనుకొని ప్రభుత్వరంగ బ్యాంకులో రూ.2 లక్షలకు పైగా రుణం తీసుకున్నాడు. ‘రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తా’మని కాంగ్రెస్ సర్కారు చెప్పిన మాటలు నిజమని నమ్మి.. తన పంట రుణం కూడా మాఫీ అవుతుందని ఆశపడ్డాడు. ఈ క్రమంలో తన భార్యకు కిడ్నీ సమస్య తలెత్తి మరిన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కట్టుకున్నామె వైద్యం కోసం మరో ప్రైవేటు బ్యాంకును ఆశ్రయించి వ్యక్తిగత అప్పు తీసుకున్నాడు.
వానకాలంలో వేసిన పత్తి, కంది చేతికిరాక చితికిపోవడం.. మరోవైపు వైద్యం కోసం ఖర్చులు తడిసిమోపెడవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి రెండు కిస్తీలు కట్టక పోవడంతో బ్యాంకు అధికారులు వేధింపులకు దిగారు. ఓవైపు రుణమాఫీ కాకపోవడం.. మరోవైపు బ్యాంకు వేధింపులు అధికం కావడంతో ఇక చావే దిక్కనుకున్నాడు. రుణం తీసుకున్న బ్యాంకులోనే ఆదివాసీ గిరిజన రైతు జాదవ్ దేవ్‌రావు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో శనివారం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. పది మందికి అన్నం పెట్టే రైతన్న ఇలా దా‘రుణం’గా తనువు చాలించడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.
జాదవ్ దేవ్‌రావు (51)ది ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడ స్వగ్రామం. ఆయనకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. వానకాలంలో పత్తి, కంది పంటలు సాగు చేశాడు. రాళ్ల భూములు కావడంతోపాటు వర్షాలు లేని కారణంగా దిగుబడులు సరిగా రాలేదు. ఐదెకరాల్లో 15 క్వింటాళ్ల పత్తి, ఐదు క్వింటాళ్ల కందుల దిగుబడి వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. దేవ్‌రావు రామాయి డీజీబీ బ్యాంకులో రూ.2 లక్షలకు పైగా పంట రుణం ఉండటంతో ఆయనకు రుణమాఫీ వర్తించలేదు. సాగు కోసం రూ.ఒక లక్ష వరకు ప్రైవేటు అప్పులు చేశాడు. ఇదే దశలో ఆయన భార్య బీజిబాయి కిడ్నీ జబ్బుతో మం చాన పడింది. ఆమె వైద్య ఖర్చుల కోసం నాలుగేండ్ల కిందట ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ.3.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. రుణం ఇవ్వడానికి బ్యాంకు అధికారులు దేవ్‌రావుకున్న ఐదెకరాల భూమిని మార్టిగేజ్ చేయించుకున్నారు. వాయిదాల పద్ధతిలో ప్రతి 6 నెలలకోసారి రూ.25 వేల చొప్పున చెల్లిస్తూ వస్తున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా రెం డు కిస్తీలు చెల్లించలేకపోయా డు. ఒకవైపు పంటలు సరిగా పండకపోవడంతో, మరోవైపు ప్రభుత్వ పంట రుణం మాఫీ చేయకపోవడంతో తీవ్రంగా మదనపడ్డాడు. ఈ సమయంలో బ్యాంకు అధికారులు ఇటీవల గ్రామానికి వెళ్లి తీసుకున్న లోన్ కిస్తీలు చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. రెండు రోజులుగా ఆదిలాబాద్‌లోని బ్యాంకుకు వచ్చి అధికారులను కలిసి కాళ్లావేళ్లా పడి కొంత గడువు ఇవ్వాలని రైతు దేవ్‌రావు వేడుకున్నా, ఆ అధికారుల మనసు కరగలేదని తమకు చెప్పుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
బ్యాంకులోనే పురుగుల మందు తాగిన రైతు
కిస్తీలు చెల్లించాలని బ్యాంకు అధికారులు వేధిస్తుండటంతో తాళలేని రైతు దేవ్‌రావు చావే పరిష్కారం అనుకున్నాడు. పురుగుల మందు డబ్బాతో శనివారం స్వయంగా అదే బ్యాంకుకు చేరుకున్నాడు. నేరుగా వెళ్లి బ్యాంకులోనే పురుగుల మందుతాగాడు. అంతకుముందు తన కుమారుడు ఆకాశ్‌కు ఫోన్ చేసి బ్యాంకు అధికారుల వేధింపుల కారణంగా తాను పురుగుల మందు తాగుతున్నట్టు చెప్పాడు. బ్యాంకులోనే కుర్చీలో ఆపస్మారకస్థితిలో పడి ఉన్న దేవ్రావును సిబ్బంది రిమ్స్‌కు తరలించారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బ్యాంకులో పురుగుల మందు డబ్బా పోలీసులకు లభించింది. పురుగుల మందు తాగిన సమయంలో బ్యాంకు సీసీ పుటేజీ కూడా బయటకొచ్చింది. దీంతో వేధింపులకు పాల్పడిన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా బ్యాంకు ఎదుట పోలీసులు బందోబస్తు ఏర్పాట్లుచేశారు. బ్యాంకుకు వచ్చిన దేవ్‌రావు కిస్తీల చెల్లింపు కోసం అధికారులను గడువు అడిగినా ఒప్పుకోకపోవడంతో వెంట తెచ్చుకున్న పురుగుల ముందు తాగాడని, వారు వెంటనే దవాఖానకు తరలించకుండా కుర్చీలో కూర్చొబెట్టారని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఆయన ప్రాణాలు విడిచారని ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబసభ్యులు, గ్రామస్థుల ఆందోళన
రైతు దేవ్‌రావు మృతికి కారణమైన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బ్యాంకు ఎదుట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బ్యాంకు అధికారులు రైతు భూమిని మార్టిగేజ్ చేయించుకొని వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. అధికారుల వేధింపులు భరించలేకే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నతాధికారులతో మాట్లాడి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.