ఖైరతాబాద్, జనవరి 4: గుండెలో అలజడి.. భయం.. దడ.. ఇది ప్రతి మనిషిలో కనిపించే లక్షణం. అయితే తరచూ దడ వస్తే మాత్రం అది గుండె సమస్యగా పరిగణించాలని వైద్యులు చెప్తున్నారు. ఆ సమస్య ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చని అంటున్నారు. వైద్య రంగంలో ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రుగ్మతలకు శాశ్వత పరిష్కారాలు లబిస్తున్నాయి. ముఖ్యంగా గుండె దడకు శాశ్వతమైన చికిత్సను నిమ్స్ వైద్యులు అందుబాటులోకి తెచ్చారు. 2డీ, 3డీ మ్యాపింగ్‌తో రేడియో ఫ్రీక్వేన్సి క్యాథటర్ అబ్లేషన్ చికిత్సలతో గుండె దడకు ఇకపై మందులు వాడాల్సిన అవసరం ఉండదని నిమ్స్ సీనియర్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఓరుగంటి సాయి సతీశ్ తెలిపారు. నిమ్స్ బోర్డు రూమ్‌లో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ ఆధునిక చికిత్స వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హేమంత్, డాక్టర్ సూరజ్, డాక్టర్ అమర్నాథ్, డాక్టర్ త్యాగు, డాక్టర్ అజయ్, డాక్టర్ సమద్, డాక్టర్ పురుషోత్తం, ప్రజా సంబంధాల అధికారి సత్యగౌడ్ పాల్గొన్నారు.
గుండె దడ ఎందుకు వస్తుంది
గుండె దడకు వయస్సుతో సంబంధం ఉండదు. చిన్న వయస్సు నుంచి వృద్ధుల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అధికంగా గుండె దడ వల్ల రక్తపోటు తగ్గి ఆయాసం రావడం, చెమటలు పట్టడం, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు ఉంటాయి. వైద్య పరిభాషలో సుప్ర వెంట్రిక్యూలర్ టాకి కార్డియా (ఎస్వీటీ) అంటారు. ఇది నిమిషాల నుంచి గంటల తరబడి ఉంటుంది. గుండె కొట్టుకోవడానికి విద్యుత్ తరంగాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. దాని ప్రసారంలో హెచ్చుతగ్గుల వల్ల, పుట్టుకతో వచ్చే సమస్యల వల్ల ఇది సంభవిస్తుంది. దీనిని డబ్ల్యూబీఎస్ సిండ్రోమ్ అంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీస్తుందని చెప్తున్నారు. అయితే వైద్యరంగంలో దీనికి అనేక మందులు ఉన్నాయి. జీవితాంతం వాడాల్సి ఉంటుంది. కాని ఆ మందుల వల్ల దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి.
ఆర్ఎఫ్ఏ చికిత్సతో శాశ్వత పరిష్కారం
నిమ్స్ దవాఖానలో అందుబాటులోకి వచ్చిన 2డీ, 3డీ మ్యాపింగ్ టెక్నాలజీ ద్వారా ఈ సమస్యను క్షేత్రస్థాయిలో తెలుసుకోవచ్చు. ప్రత్యేకమైన క్యాథటర్లను గుండెలోకి పంపించి 2డీ, 3డీ మ్యాపింగ్ ద్వారా సమస్యను తెలుసుకొని రేడీయో ఫ్రీక్వెన్సీ క్యాథటర్ అబ్లేషన్ చికిత్స ద్వారా అధిక విద్యుత్ ప్రసారాన్ని నిలిపివేసి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. 2డీ మ్యాపింగ్‌కు గంట, 3డీ మ్యాపింగ్‌కు రెండు గంటల సమయం పడుతుంది. ఇప్పటివరకు 109 మందికి విజయవంతంగా చికిత్స అందించారు. చికిత్స పూర్తయిన తర్వాత గుండె దడ కోసం రోగి మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదని డాక్టర్ సాయి సతీశ్ తెలిపారు.
ఆరోగ్యశ్రీలో ఉచిత చికిత్స
ప్రైవేట్ దవాఖానల్లో ఇలాంటి చికిత్స విధానాలకు రూ.5 లక్షలకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉంది. నిమ్స్‌లో కేవలం రూ.50వేల నుంచి రూ.లక్ష లోపు అవుతుందని, ఆరోగ్యశ్రీ ఉన్న వారికి ఉచితంగా, సీఎంఆర్ఎఫ్, ఆర్టీసీ, సింగరేణి కాలరీస్, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులకు రాయితీలు వర్తిస్తాయని తెలిపారు.
గుండె సమస్యలకు పోస్ట్ కొవిడ్ కూడా కారణమే
గుండె సంబంధిత సమస్యలకు కాఫీ, టీ, మద్యం, అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక రక్తపోటు, మధుమేహం కారణం. కొందరికి వంశపార్యంపరంగా కూడా వస్తున్నాయి. గత మూడు సంవత్సరాలలో పోస్ట్ కొవిడ్ కూడా గుండె సమస్యలకు దారి తీస్తున్నది. కొవిడ్ వైరస్ ప్రభావం గుండె కణజాలంపై పడటం వల్ల తరచూ గుండెపోటు, గుండె దడ, ఇతర సమస్యలు వస్తున్నాయి. ప్రతి వెయ్యి మందిలో ఐదారు మందికి గుండె సమస్యలు వస్తున్నాయి. నిమ్స్ దవాఖానలో ప్రైవేట్‌కు దీటుగా ఆధునిక చికిత్సలు అందిస్తున్నాం. 2డీ, 3డీ మ్యాపింగ్ ద్వారా రేడీయో ఫ్రీక్వెన్సీ క్యాథటర్ అబ్లేషన్ చికిత్స విధానం తెలుగు రాష్ర్టాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో ఒక్క నిమ్స్ దవాఖానలోనే అందుబాటులో ఉంది.
– సీనియర్ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఓరుగంటి సాయి సతీశ్