హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ ) : టీచర్ల శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన పాఠశాల విద్యాశాఖ.. భవిత కేంద్రాల్లోని ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్లకు (ఐఈఆర్పీ) శిక్షణనిచ్చేందుకు చర్యలు చేపట్టింది. శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు విద్యనందించే భవిత కేంద్రాల్లోని ఐఈఆర్పీలకు మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణ జూన్ 17తో ముగియనున్నది.
రాష్ట్రంలోని 634 భవిత కేంద్రాల్లో 780 మంది ఐఈఆర్పీలు పనిచేస్తున్నారు. వీరికి మే 30 నుంచి జూన్ 3వరకు తొలివిడత ఇస్తారు. జూన్ 6 నుంచి 10 వరకు రెండో విడత, జూన్13 నుంచి 17వ తేదీ వరకు మూడోవిడత శిక్షణను ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లోని పలు సంస్థలు సహా మార్గిక ఎన్జీవో సంస్థ ద్వారా ఈ శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో భాగంగా ఆర్థోపెడిక్, ఇంటలెక్చువల్, వినికిడి లోపం, ఆటిజంతో బాధపడుతున్న విద్యార్థులను సాధారణ విద్యార్థుల స్థాయికి తీసుకురావడంతోపాటు సైగల భాష, డెఫ్ లాంగ్వేజ్‌లో తర్ఫీదును ఇవ్వనున్నారు.
పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక వైకల్యాలకు వైద్యం అందించేందుకు.. కనీస సామర్థ్యాలు సాధించేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖలో అంతర్భాగంగా భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో పిల్లలకు చదువు, ఆటపాటలు నేర్పించి సాధారణ పిల్లలుగా మార్చేందుకు ప్రయత్నిస్తారు. వైకల్యం గల పిల్లలకు ఫిజియోథెరపీ చేస్తారు. పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాలను నిర్వహించి.. సామర్థ్యాలు సాధించిన వారిని రెగ్యులర్ విద్యార్థుల్లో మిళితం చేస్తారు. రాష్ట్రంలో ఇలాంటి వారు 10,611 మంది విద్యార్థులుండగా, వీరిలో 7,447 మంది స్వల్ప వైకల్యంతో బాధపడుతున్నారు. వీరంతా తల్లిదండ్రుల ద్వారా భవిత కేంద్రాలకు వస్తున్నారు. మరో 3,164 మంది కదల్లేని, మెదల్లేని స్థితిలో ఇండ్లకే పరిమితయ్యారు. వీరికి హోంబేస్డ్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ప్రతి శనివారం ఐఈఆర్పీలు ఇండ్లకు వెళ్లి జీవననైపుణ్యాలు, తినడం, అవసరాలు తీర్చుకోవడం వంటి వాటిపై పిల్లలకు శిక్షణనిస్తారు.