మాగనూరు : తమ పిల్లలు ఉన్నత స్థితిలో చూడాలని కలలుగన్న యాచకవృత్తి చేస్తూ చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశలు నిరాశే అయ్యాయి. చిన్న కూతురిని డాక్టర్ ( Doctor ) చేయాలన్న సంకల్పం తీరకుండానే రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మాగనూరు మండలం గురురావు లింగంపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి (20) అనే నర్సింగ్ విద్యార్థి ( Nursing Student ) మంగళవారం గద్వాల జోగులాంబ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గ్రామానికి చెందిన బిచ్చగాళ్ల మారెప్ప, మణెమ్మ దంపతులు యాచక వృత్తితో జీవనం పొందుతున్నారు. పెద్దల తరం నుంచి యాచక వృత్తిని నమ్ముకున్న కుటుంబం తమ పిల్లలు గొప్ప చదువులు చదివి ప్రయోజకులు కావాలని, తమ తరంతోనే యాచక వృత్తికి స్వస్తి పలకాలని భావించి పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు.
గ్రామంలో చిన్న తడకల గుడిసెలో జీవనం గడుపుతూ తెల్లారిందే మొదలు ఇల్లు ఇల్లు తిరిగి పోగుచేసిన డబ్బులతో తమ పిల్లలను చదివించుకుంటున్నారు. తండ్రి మారెప్పకు కొంతకాలంగా పక్షవాతంతో మంచాన పడి కోలుకోలేని స్థితికి చేరుకోవడంతో వారి జీవనాధారం ఇంకా దీనస్థితికి చేరిపోయింది. ఈ దంపతులకు ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు.
చివరి అమ్మాయి మహేశ్వరి గద్వాల్ జిల్లాలో నర్సింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటుంది. గద్వాల జిల్లా కేంద్రంలోని కొత్త హోసింగ్ బోర్డులో రిక్వెస్ట్ బస్ స్టాప్ దగ్గర మంగళవారం బస్సు కోసం ఎదురు చూస్తుండగా అకస్మాత్తుగా బొలోరా వాహనం వేగంగా దూసుకొచ్చి మహేశ్వరితో పాటు మరికొంత మంది విద్యార్థులను బలంగా ఢీకొట్టింది. దీంతో మహేశ్వరితో పాటు మరో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందింది.