హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి పార్టీ వీడటంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు పార్టీని వీడటం బాధాకరమని తెలిపారు. సోనియా, రాహుల్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి విధేయుడైన జీవన్‌రెడ్డి విషయంలో ఇలా జరగడం పార్టీకి మంచిదికాదని అభిప్రాయపడ్డారు.
అంతర్గతంగా ఏం జరిగిందో ఏఐసీసీ స్థాయిలో పరిశీలిస్తే బాగుండేదని చెప్పుకొచ్చారు. జీవన్‌రెడ్డి విషయంలో ఢిల్లీ నాయకత్వం స్పందిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీలు మారడం ప్రస్తుత రాజకీయాల్లో సహజమేనని చెప్పారు. కానీ జీవన్‌రెడ్డి లాంటి నాయకుడు పార్టీ మారడానికి కారణాలను బహిరంగంగా మీడియాతో మాట్లాడలేమని, పార్టీ అంతర్గత సమావేశంలో దీనిపై తప్పక చర్చిస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు.